Kite Flying Deaths: హైదరాబాద్‌లో వరుస విషాదాలు- భవనం పైనుంచి పడి యువకుడు, మాంజా దారం మెడకు చుట్టుకుని జవాన్ మృతి
China Manja killed Army staff: సంక్రాంతి పండుగ వేళ పతంగుల సందడి మొదలైంది. కానీ హైదరాబాద్‌లో ఎన్నో కుటుంబాలలో గాలిపటాల సరదా విషాదాన్ని నింపుతోంది.
Kite Flying Mishaps in Hyderabad: హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ పతంగుల సందడి మొదలైంది. కానీ గాలిపటాల పండుగ ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతోంది. ఇదివరకే హైదరాబాద్ లో గాలిపటాలు ఎగరవేస్తూ ముగ్గురు చనిపోగా, తాజాగా ఆర్మీ జవాన్ మాంజా దారం మెడకు చుట్టుకుని తీవ్రగాయాలతో మృతిచెందాడు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాలిపటం ఎగురవేస్తూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న Asi రాజ శేఖర్ కుమారుడు ఆకాష్ పండుగ సందర్భంగా గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేస్తూ, భవనం పైనుంచి పడిపోయి యువకుడు ఆకాష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మెడకు మాంజా దారం చుట్టుకుని సైనికుడి మృతి
అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. పాటించకపోవడంతో గాలి పటాలు ఎగురవేస్తూ చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఎవరో చేసిన తప్పిదానికి ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన కోటేశ్వర్ రెడ్డి ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. డ్యూటీ ముగించుకుని బైకుపై వెళ్తుండగా.. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఆయన మెడకు మాంజా చుట్టుకుంది. మాంజా మెడకు బిగుసుకుని జవాన్ కోటేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సైనికుడు కన్నుమూశారు.
జోగిపేటలో భర్త మృతి, భార్యకు గాయాలు
సంగారెడ్డిలోని జోగిపేటలో పతంగులు ఎగురవేస్తుంటే విషాదం చోటుచేసుకుంది. గాలి పటాలు ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో భర్త మృతి చెందగా, భార్యకు గాయాలయ్యాయి.
కుక్క నుంచి తప్పించుకోబోయి బిల్డింగ్ పై నుంచి పడిపోయి..
పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరవేస్తూ ఓ బాలుడు భవనం పై నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఒంగోలు జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా తాపీ మేస్త్రి బతుకుతెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి నాగోల్ లో ఇంటిని అద్దెకి తీసుకొని భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు.. కుమారుడు శివకుమార్(13) నాగోల్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. పక్క బిల్డింగ్ పైకి వెళ్లి తోటి స్నేహితులతో కైట్ ఎగురవేస్తున్నాడు. అంతలో ఓ కుక్క అతడి మీదకు రావడంతో.. దాని బారి నుంచి తప్పించుకునేందుకు వెనక్కి వెళ్తూ భవనం పై నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలతో బాలుడు శివకుమార్ చనిపోయాడు. అతడి తల్లిదండ్రులు నాగోల్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.