Madanapalle Cars Theft Gang : హైదరాబాద్ కార్లు మదనపల్లె తనఖా, నకిలీ తాళంతో రాత్రికి చోరీ!
Madanapalle Cars Theft Gang : నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి. రూ.25 లక్షల కారు 5 లక్షలకు తనఖా పెడుతున్నాను. అని ఎవరైనా చెబితే ఒకసారి ఆలోచించండి. తెలంగాణ కార్లను ఏపీలో కుదువ పెడుతూ తర్వాత ఆ కార్లను ఓ గ్యాంగ్ చోరీ చేస్తుంది.

Madanapalle Cars Theft Gang : కార్లను కుదువ పెట్టి తిరిగి వాటిని దొంగలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5 కోట్ల రూపాయల విలువైన 9 కార్లు సీజ్ చేశామని డీఎస్పీ రవి మనోహారాచారి తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికు చెందిన మొహమ్మద్ ఇయాజ్, ప్రసాద్, కడప జిల్లా రాయచోటికి చెందిన నందలూరి రాజా నర్మదారెడ్డి, రాయచోటి లక్కిరెడ్డిపల్లెకు చెందిన పగిడిపల్లి సుబహాన్ లను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
నకిలీ తాళాలతో దొంగతనం
డీఎస్పీ రవిమనోహారాచారి మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లో కార్ల యజమానుల దగ్గర కార్లను బాడుగకు తీసుకుని వాటిని ఏపీకి తీసుకొచ్చి కుదువకు ఇచ్చారని తెలిపారు. అలా ఇచ్చాక కార్లలోని జీపీఆర్ఎస్ ఆధారంగా, నకిలీ తాళాలతో ఆ కార్లను కార్టన్ సెర్చ్ పేరిట వాటిని స్వాధీనం చేసుకుని అసలు ఓనర్లుకు ఇచ్చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారని తెలిపారు. వీరిని మదనపల్లె టౌన్ ఎస్బీఐ కాలనీ వద్ద అరెస్టు చేసి దొంగిలించిన కార్లలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రమోహన్, పోలీసు సిబ్బందిని డీఎస్పీ రవిమనోహారాచారి అభినందించారు.
ఎలా ఎవరైనా చెబితే నమ్మొద్దు
"తొమ్మిది కార్లను నిందితులు వాటి ఓనర్ల దగ్గర రెంట్ కు తీసుకొచ్చి వాటిని వేరే వాళ్లకు కుదువ పెడతారు. వాటినే నకిలీ తాళాలతో దొంగిలించుకుపోతారు. వీళ్లు హైదరాబాద్ లో కార్లను రెంట్ కు తీసుకుని మదనపల్లెలో కుదువ పెట్టారు. ఓనర్ల ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో కార్లను నకిలీ తాళాలతో దొంగిలించుకోపోతున్నారు. 9 కార్లు రికవరీ చేశాం. ఇంకా రెండు, మూడు కార్లు ఉంటాయి. వీటి ధర మొత్తం రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది. ఎవరైనా వచ్చి నాకు అవసరం ఉంది కారు కుదువ పెట్టుకోండి. 25 లక్షల కారు 5 లక్షలు ఇస్తామంటే ఎవరూ నమ్మకండి. బండి ఓనర్లు కూడా కారు రెంట్ కి ఇచ్చే ముందు ఎవరికి ఇస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోండి. కుదువ పెట్టుకునేవాళ్లు కూడా కారు సరైన పత్రాలు ఉన్నాయా. ఎక్కడ బండి ఇక్కడ ఎందుకు కుదువ పెడుతున్నారో ఒకసారి విజ్ఞత ఉపయోగించండి." అని డీఎస్పీ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

