Lovers Suicide: వాట్సాప్‌లో చాటింగ్, ఆపై పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - అసలేం జరిగిందంటే !
Lovers Suicide: ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేస్కోవాలనుకున్నారు. వారు ఇంట్లో చెప్పకముందే విషయం తెలిసిపోయింది. దీంతో భయపడిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేస్కున్నారు
Lovers Suicide: ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కలిసే నడుద్దాం అనుకున్నారు. బాగా చదివి ఉద్యోగం సంపాదించాకే.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తమ ప్రేమ విషయం వేరే వ్యక్తుల ద్వారా ఇంట్లో తెలిసిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆ ప్రేమ జంటను మందలించారు. వారు ఎలాగూ తమ పెళ్లికి ఒప్పుకోరని ఆందోళకు గురయ్యారు. ఏం చేయాలో అర్థంకాక ఆ ప్రేమికులు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ ప్లాన్ ప్రకారం ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేస్కున్నారు. ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపుతోంది.
కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామ శివారు భీక్యా నాయక్ గ్రామానికి చెందిన విద్యార్థిని (16), అదే గ్రామానికి చెందిన గుగులోతు పాపా, టీక్యా దంపతులు కురమారుడు రాజు(22) గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. రాజు ప్రస్తుతం కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. యువతి ఇంటర్ చదువుతోంది. ఒకే గ్రామానికి చెందిన వీరి మధ్య చాలా కాలంగానే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే రాజు కాస్త సెటిల్ అయి, దీపిక బాగా చదివి ఉద్యోగం సంపాదించాకా తమ విషయాన్ని పెద్దలకు చెప్పాలనుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోనే వారి ప్రేమ విషయం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది.
అతడ్ని పెళ్లి చేసుకోవద్దన్న తల్లిదండ్రులు..
పిల్లల ప్రేమ వ్యవహారం తెలిసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. ఇంటర్ చదివే అమ్మాయి కారు డ్రైవర్ తో ప్రేమలో పడటం ఏంటో అర్థం కాలేదు. అతడ్ని పెళ్లి చేసుకోవద్దని, దూరంగా ఉండాలంటూ కూతురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. ఇక తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోరని... ప్రేమించిన వాడికి దూరంగా ఉండాల్సి వస్తుందని విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైంది. కలిసి ఎలాగూ బతకలేమని.. చావులోనైనా కలిసుందామని ఆ ఇద్దరూ భావించారు. ఇద్దరూ కలిసి ఎలా, ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి తండా శివారులోని ప్రకృతి వనానికి వెళ్లారు.
పల్లె ప్రకృతి వనంలో ఆత్మహత్య..
ప్రేమ జంట తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. గతంలో తండాలోని ఓ అమ్మాయిని ప్రేమించిన రాజు.. ప్రస్తుతం తమ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి ఆమె ప్రాణాలు సైతం తీశాడంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండే, అమ్మాయి తల్లిదండ్రులు వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పే సరికి నిరసనను ఆపారు. కానీ కచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత యువతి, రాజుల మృత దేహాలను పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే శుక్రవారం రోజు రాత్రి రాజు, విద్యార్థిని వాట్సాప్ లో ఛాటింగ్ చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకోవాలని సోషల్ మీడియాలో మెస్సేజ్‌లు చేసుకుని, ప్లాన్ ప్రకారమే వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.