Khammam Drugs : డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు - సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
Software Engineer Arrest : ఖమ్మంలో హెరాయిన్ పట్టుబడింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అసోం నుంచి డ్రగ్స్ ను స్పీడ్ పోస్టులో తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు.
Police Caught The Drug Buyer : రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టి.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఓ చోట ఇంకా వాటి మాట వినిపిస్తూనే ఉంది. కొంతమంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడు వ్యసనాలకు వినియోగిస్తున్నారు. డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్‌ను ఆర్డర్ చేసి డెలివరీ తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఖమ్మంలో డ్రగ్స్ కలకలం
ఖమ్మంలో డ్రగ్స్ ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా ఖమ్మంలో హెరాయిన్ పట్టుబడింది. ఓ టెకీ అసోం నుంచి దీన్ని స్పీడ్ పోస్ట్ లో తెప్పించుకోవడం గుబులు రేపుతోంది. అయితే అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హెరాయిన్ కు అలవాటు పడిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తరచుగా డ్రగ్స్ తెప్పించునేవాడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖమ్మం నగరం రోటరీ నగర్ రెండో లైన్ లో నివాసం ఉంటున్న ఆ టెకీ తాజాగా అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో తెప్పించుకున్న హెరాయిన్ పోలీసులకు దొరికింది. ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా డ్రగ్స్ కు బానిసగా మారిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిత్యం వాటితోనే సహ జీవనం చేసేవాడని స్పష్టంగా తెలుస్తోంది. అసోం నుంచి ఖమ్మం నగరానికి డ్రగ్స్ డెలివరీ అవుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు డార్క్ వెబ్ ఆపరేషన్ ద్వారా స్పీడ్ పోస్ట్ లో వచ్చిన హెరాయిన్ ను రెడ్ హ్యాండెడ్ గా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల నిఘా
డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కోసం ఆర్డర్ చేస్తున్నాడనే సందేహం కలిగి అతడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. జులై 31న డార్క్ వెబ్ ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్ వస్తున్నట్లు పక్కా సమాచారంతో అతనిపై దృష్టిపెట్టారు. అసోం నుంచి స్పీడ్ పోస్టులో ఖమ్మం జిల్లాకు మాదక ద్రవ్యాలు వస్తున్నట్లుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ నెల 8వ తేదీన డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో టీజీ న్యాబ్, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడి చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ పేపర్లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించి డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన సమయంలో క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, తన తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
డ్రగ్స్ మత్తులో జోగుతున్న యువత?
ప్రధానంగా యువతే లక్ష్యంగా డ్రగ్స్ వ్యాపారులు అంచెలంచెలుగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. డ్రగ్స్ విషయానికి వస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా పెద్ద ఎత్తున గంజాయి తరలింపు సర్వసాధారణంగా మారింది. ఛత్తీస్‌గఢ్ తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్న సందర్భాలు అనేకం. ఏకంగా ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు చాక్లెట్ల రూపంలో గంజాయి తీసుకెళ్తుండగా పట్టుబడ్డారు. అయితే జిల్లాలో కొంత మంది యువత మద్యపానం, ధూమపానంతో పాటు గంజాయి, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు బానిసలైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇంజినీరింగ్ , మెడికల్ కాలేజీల విద్యార్థులు, మరికొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఈ వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించింది. పోలీసులకు పగ్గాలు అప్పగించి డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. అయినా కూడా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ జాడలు బయటకు వస్తుండటం విస్మయం కలిగిస్తోంది.