Kerala Mass Murders: గర్ల్‌ఫ్రెండ్‌ను ఒంటరి చేయొద్దని చంపేశాడు.. కేరళ హత్య కేసుల్లో విస్తుపోయే నిజాలు
కేరళలో వరుస హత్యల కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. అప్పుల బాధతో కుటుంబసభ్యులను హత్య చేసి వయకుడు.. తాను చనిపోతే తన ప్రేయసి ఒంటరైపోతుందని ఆమెను కూడా హత్య చేసినట్లు తేలింది.

Kerala Crime News | కేరళలో వరుస హత్య కేసులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. అప్పుల బాధతో నలుగురు కుటుంబసభ్యులను హత్య చేసి 23 ఏళ్ల అఫాన్.. తాను కూడా చనిపోతే తన ప్రేయసి ఒంటరైపోతుందని ఆమెను కూడా హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.
ఇదీ జరిగింది
కేరళ తిరువనంతపురంలోని వెంజరమూడుకు చెందిన అఫాన్ (23) కుటుంబంతో కలిసి ఉండేవాడు. అతడి తండ్రి సౌదీలో ఉంటున్నారు. అయితే ఆ కుటుంబానికి దాదాపు రూ.65 లక్షల అప్పు ఉంది. 14 మంది వద్ద ఈ అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని తరచూ వేధిస్తుండేవారు. వారి ఒత్తిడిన అఫాన్ తట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అప్పులు తీర్చే పరిస్థితి లేదని, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి నుంచి శాశ్వత పరిష్కారానికి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కలిసి ఆత్మహత్య చేసుకుందామని విషయాన్ని తల్లి, 13 సంవత్సరాల తమ్ముడికి చెప్పాడు. దానికి వారు నిరాకరించడంతో వారిని హత్య చేసి సూసైడ్ చేసుకుందామని భావించాడు.
కుటుంబసభ్యుల దారుణహత్య
ప్లాన్ మొదట తల్లిపై దాడి చేసి అఫాన్.. ఆమె తీవ్రంగా గాయపడడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పు తీర్చే విషయంలో నాన్నమ్మ, అతడి బాబాయ్, పిన్ని ఏమాత్రం సాయం చేయలేదని వారిపై అప్పటికే పగ పెంచుకున్న అఫాన్ తర్వాత నానమ్మ ఇంటికి వెళ్లాడు. నానమ్మను చంపేసి ఆమె వద్ద బంగారం గొలుసును తీసుకున్నాడు. ఆపై బాబాయ్, పిన్ని ఇంటికి వెళ్లి ఆ ఇద్దరిని కూడా అంతమొందించాడు.
ఐదు హత్యల అనంతరం లొంగుబాటు
ఆ తర్వాత తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న తమ్ముడిని చంపేశాడు. తాను చనిపోతే తన ప్రియురాలు ఫర్సానా ఒంటరైపోతుందని భావించిన అఫాన్.. ఆవేదనతో అక్కడే ఉన్న ఆమెను కూడా హతమార్చాడు. ఐదుగురిని పొట్టనపెట్టుకున్న నిందితుడు అనంతరం వంజరమూడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
అఫాన్, గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలాంటి గొడవలు లేవు
ఈ ఘటనలపై ఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. వరుస హత్యల వెనుక ఆర్థిక ఇబ్బందులు కాకుండా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన తర్వాత కూడా అఫాన్ బిహేవియర్లో తేడాలు గమనించినట్లు పేర్కొన్నారు. ‘మానసిక ఆరోగ్య నిపుణుల సమక్షంలో అఫాన్‌ను విచారించనున్నాం. అతడి మానసిక స్థితిని కూడా పరిశీలిస్తాం. అతడికి గర్ల్‌ఫ్రెండ్ ఫర్సానా పట్ల ఎలాంటి శత్రుత్వం ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సామూహిక ఆత్మహత్య ప్రణాళిక గురించి కూడా ఆమెకు చెప్పలేదు’ అని వెల్లడించారు.
నా కొడుకు దాడి చేయలేదు, మంచం మీద నుంచి కిందపడ్డా: అఫాన్ తల్లి
తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అఫాన్ తల్లి షమీమా తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తనపై అఫాన్ దాడి చేయలేదని, తానే మంచం మీద నుంచి కింద పడిపోయానని పేర్కొనడం గమనార్హం. అయితే ఆమె కుమారుడు ఏమేం చేశాడనే విషయాలు ఆమెకు తెలియదని, అందుకే అలా చెబుతోందని పోలీసులు పేర్కొన్నారు.
ఇన్ని అప్పులున్నాయని నాకు తెలియదు: అఫాన్ తండ్రి
విషయం తెలుసుకున్న సౌదీలో ఉన్న అఫాన్ తండ్రి రహీమ్ అక్కడి నుంచి తిరిగొచ్చారు. పోలీసులతో మాట్లాడుతూ బోరుమన్నారు. తన కుటుంబానికి ఇన్ని అప్పులున్న విషయం తనకు తెలీదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అఫాన్‌కు బ్యాంకు రుణం, బంధువు నుంచి తీసుకున్న రుణం కలిపి రూ.15 లక్షల అప్పు ఉందని మాత్రమే తనకు తెలుసన్నారు. కొంత అప్పు చెల్లించడానికి ఫర్సానాకు చెందిన బంగారు హారాన్ని అఫాన్ తాకట్టు పెట్టాడని, అయితే దాన్ని తిరిగి పొందేందుకు అఫాన్‌కు తాను రూ.60 వేలు పంపినట్లు పోలీసులకు రహీమ్ చెప్పుకొచ్చారు.





















