Karimnagar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కారు ఢీకొని చిన్నారి మృతి - మద్యం మత్తులో డ్రైవర్ !
Karimnagar Road Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి వద్దకు వెళ్తున్న చిన్నారిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది.
Karimnagar Road Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి వద్దకు వెళ్తున్న చిన్నారిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. తిమ్మాపూర్ లోని రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ మొబైల్ టిఫిన్ సెంటర్ లో తల్లి దగ్గరికి వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయిని అత్యంత వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో ఆ బాలిక దాదాపు 30 మీటర్ల దూరం ఎగిరి పడి మృతి చెందింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ లో రికార్డ్ అయింది. అయితే రోడ్డు ప్రమాదం ఘటనకు కారకులైన వారి ప్రవర్తన తీవ్ర ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది.
అసలేం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన జంపయ్య.. రాజేశ్వరి దంపతులు తిమ్మాపూర్ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అక్కడే రాజేశ్వరి టిఫిన్ సెంటర్ లో పని చేస్తున్నది. ఆమె కూతురు శివాని గుండ్లపల్లిలో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంది. అయితే తన తల్లిని కలవడానికి బయటికి వచ్చిన శివానిని రహదారిపై అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. సంతోష్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు. దీంతో ఆ బాలిక 30 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందింది. అయితే అప్పటికే మద్యం సేవించి ఉన్న కారులోని ముగ్గురూ ఇంత జరిగినా మళ్లీ సమీపంలోని వైన్స్ వద్దకు వెళ్లి మద్యం తాగి పారిపోయినట్లు గా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
వర్షాలతో గోడకూలి తల్లి, పిల్లలకు గాయాలు
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నల్లగొండ మండలం కాంచనపల్లి గ్రామంలో వర్షాలకు రాత్రి ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై ఇటుకలు పడ్డ ప్రమాదంలో యాదమ్మ అనే మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటలు గడిస్తేగానీ, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది.
Also Read: Youtube Thief: అప్పుల బాధ భరించలేక, యూట్యూబ్‌లో టెక్నిక్స్ నేర్చుకుని మరీ చోరీ - కథ అడ్డం తిరిగింది