Karimnagar: కన్నతల్లినే చంపించిన కూతురు! అలా కుదర్లేదని మాస్టర్ ప్లాన్ - అవాక్కైన పోలీసులు!
నిందితులందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఆస్తి కోసం కన్న కూతురే మర్డర్ కి ప్లాన్ వేసిన విషయం బయటపడింది. దీంతో కన్న కూతురి దురాగతం తెలిసిన గ్రామస్థులు, పోలీసులు ఆశ్చర్యపోయారు.
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన రామకృష్ణా కాలనీ మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తిని పొందడానికి కన్న కూతురే తల్లిని సుపారి మాట్లాడి మరీ మర్డర్ చేయించిందని పోలీసులు గుర్తించారు. గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. నిద్రిస్తున్న ఇద్దరు మహిళలపై దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి ఒకరిని అక్కడికక్కడే నరికి చంపారు. అయితే విచారణలో పోలీసులకు చనిపోయిన మహిళ కూతురే ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలింది. మానవ సంబంధాలను మంట కలిపిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ లో రామకృష్ణ కాలనీకి చెందిన కొమ్మెర రాధవ్వ కూతురు సులోచన రెడ్డిని అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కూతురు తేజశ్రీ ఉంది. అయితే సత్యనారాయణ ఆకస్మికంగా చనిపోవడంతో సులోచన తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ బతుకుతోంది. కూతురు తేజశ్రీ అదే గ్రామానికి చెందిన అరుణేందర్ రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. కొద్ది రోజులపాటు తల్లి కూతుర్ల మధ్య మాటలు లేకపోయినా తిరిగి కలిసి పోయారు. అయితే కూతురు ప్లాన్ మొత్తం వేరేగా ఉంది. తన తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిలో వాటా కావాలంటూ తేజశ్రీ పలుమార్లు తల్లితో గొడవకు దిగింది. అంతే కాకుండా ఇదే విషయం తన మామ కృష్ణారెడ్డికి కూడా వివరించింది. దీంతో సులోచనని అడ్డు తొలగించుకోవాలని మామ, కోడలు నిర్ణయించుకున్నారు. ఇందులో ఇద్దరు సుపారి కిల్లర్లను ఇన్వాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపుగా 20 రోజుల నుండి పూర్తిస్థాయిలో రెక్కీ వేయడం ప్రారంభించారు నిందితులు.
ఒకసారి విఫలమైనా?
సులోచన ఇంటికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన నిందితులు కొద్ది రోజుల కిందట మర్డర్ చేయడానికి ఆమె ఇంటిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే అదే ఇంట్లో రెంట్ కి ఉంటున్న ఓ వ్యక్తి వీరిని గమనించి ఎవరో తాగుబోతులు అనుకొని గట్టిగా హెచ్చరించాడు. దీంతో హంతకులు అక్కడి నుండి సైలెంట్ గా వెళ్లిపోయారు. సదరు వ్యక్తి కూడా ఈ సంఘటనని సీరియస్ గా తీసుకోకపోవడంతో సులోచనకు జరిగిన విషయాన్ని వెల్లడించలేదు. ఇక ఇలా అయితే కుదరదని భావించిన తేజశ్రీ తనే స్వయంగా పండగకు వచ్చినట్టుగా తల్లి దగ్గరికి వచ్చి చేరింది.
పక్క గదిలో పడుకొని రాత్రి 11 గంటలకు ప్లాన్ ప్రకారం భర్త అరుణేందర్ రెడ్డితో కలిసి చాట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికే హంతకులకు గైడెన్స్ ఇస్తూ తన ఇంట్లో జరుగుతున్న విషయాన్ని వెల్లడించడం మొదలుపెట్టింది. లోనికి వచ్చిన హంతకులు సులోచనపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఇది చూసిన ఆమె తల్లి రాధవ్వ (తేజశ్రీ అమ్మమ్మత) అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను సైతం గాయపరిచారు. తీవ్ర గాయాల పాలైన సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. రాధవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. హత్యానంతరం నిందితులు అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఒక్కో రహస్యం మెల్లగా బయటపడింది. దీంతో నిందితులందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఆస్తి కోసం కన్న కూతురే మర్డర్ కి ప్లాన్ వేసిన విషయం బయటపడింది. దీంతో కన్న కూతురి దురాగతం తెలిసిన గ్రామస్థులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అనే నానుడి ఈ విషయంలో నిజమని నిరూపితం అయిందని చెప్పుకున్నారు.