Kadapa News : కడప జిల్లాలో విషాదం, గాలేరు నగరి కాలువలో ఈతకు దిగి ముగ్గురు మృతి
Kadapa News : కడప జిల్లా విషాదం చోటుచేసుకుంది. గాలేరు నగరి సుజల స్రవంతి కాలువలో ఈతకు దిగి ముగ్గురు మృతి చెందారు.
Kadapa News :కడప జిల్లా వేంపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అలవలపాడులోని గాలేరు నగరి కెనాల్ లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్(8), సాయి తేజ(11) తమ చిన్నారుల మేనమామ శశికుమార్ తో కలిసి గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మునిగిపోయారు. శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్ అక్కాతమ్ముళ్లు కాగా బంధువైన జ్ఞానయ్య ఈస్టర్ పండుగకు వీరి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సాయి, సుశాంత్‌ల అమ్మ చనిపోవడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది.
సాగర సంగమం వద్ద ప్రమాదం
విజయవాడ సమీపంలోని పెనమలూరుకు చెందిన హర్షవర్ధన్ (20) శనివారం హంసలదీవి వద్ద సాగర సంగమ ప్రదేశంలో కాళ్లు కడుక్కోడానికి ప్రయత్నించి గల్లంతయ్యాడు. ఇటీవల అక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగడంతో పోలీసులు, మెరైన్ పోలీసులు ఎవరినీ సంగమ ప్రదేశానికి అనుమతించడంలేదు. అయితే శనివారం ఉదయం 9.30 గంటలకు పెనమలూరు నుంచి హర్షవర్ధన్, మరో ఆరుగురు స్నేహితులు బైక్ లపై పాలకాయతిప్ప బీచ్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సముద్రంలో స్నానం చేసి సరదాగా గడిపారు. ఆ తర్వాత సాగర సంగమానికి పోలీసుల కంట పడకుండా వేరే మార్గం ద్వారా వెళ్లారు. అక్కడ బురదగా ఎక్కువగా ఉండటంతో హర్షవర్ధన్ వాహనం జారిపోయింది. అతని కాళ్లకు బురద అంటడంతో కడుక్కోవడానికి సాగర సంగమం వద్దకు వెళ్లి అడుగువేసిన హర్షవర్ధన్ అగాధంలోకి జారిపోయాడు.
అగాధంలో మునిగిపోయి
హర్షవర్ధన్ స్నేహితులు అతడ్ని రక్షించేందుకు వెళ్లగా వారు కూడా జారిపోతుండటంతో చేతులు పట్టుకుని కాపాడుకున్నారు. హర్షవర్ధన్ మాత్రం అగాధంలో మునిగిపోయాడు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మెరైన్ పోలీసులతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు హర్షవర్ధన్ ఆచూకీ లభించలేదని ఎస్‌ఐ తెలిపారు. గల్లంతైన యువకుడితోపాటు పెనమలూరు నుంచి వచ్చిన వారిలో హేమసుందర్, ఉమామహేశ్వరరావు, సుదీర్‌కుమార్, రాజు, మరికొందరిని ఎస్‌ఐ విచారించి వివరాలు సేకరించారు. వారంతా సాయంత్రం వరకు సాగరసంగమం వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి తమ స్నేహితుడు హర్ధవర్ధన్ కోసం గాలించారు.