Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లయిన 6 నెలలకే వివాహిత దారుణహత్య.. పరారీలో భర్త!
రెండు కుటుంబాలు రెండు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాయి. వారి పరిచయంతో సంబంధం కుదిరింది. కానీ పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత దారుణహత్యకు గురైంది.
హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుర్మార్గుడు భార్యను కడతేర్చిన ఘటన జరిగిన మరుసటి రోజే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లయిన ఆరు నెలలకే భార్యను హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా హిర మండలం గొట్టాబ్యారేజీ గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అదే విధంగా ఒడిశాలోని గురండి మండలానికి చెందిన భాస్కర్ రావు కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ రెండు కుటుంబాలు మూసాపేటలో నివాసం ఉంటున్నాయి. వీరికి పరిచయం ఉన్న కుటుంబాలే కావడంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు.
భాస్కర్ రావు, కనకమ్మ దంపతుల చిన్న కుమార్తె శిరీషను కన్నయ్య కుమారుడు సంతోష్‌కు ఇవ్వాలని నిశ్ఛయించారు. మే 30న శిరీష, సంతోష్‌ల వివాహం ఘనంగా జరిపించారు. అల్లుడికి కాట్న కానుకలు తమకు తోచినంత ఇచ్చుకున్నారు భాస్కర్ రావు. రూ.3లక్షల నగదుతో పాటు కొంత బంగారం.. ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి వివాహం చేశారు. అదే ఏరియాలో శిరీష, సంతోష్ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కానీ ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన శిరీషను కొన్ని రోజులకే కష్టాలు వెంటాడాయి.
Also Read: Guntur: గుంటూరు జిల్లాలో విషాదం.... కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు...
భార్య శిరీషపై అనుమానం పెంచుకున్న సంతోష్ నిత్యం ఆమెను వేధించసాగాడు. విషయం పెద్దల వరకు వెళ్లడంతో రెండు పర్యాయాలు పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చారు. కానీ సంతోష్ ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అదే అతడి భార్య పాలిట శాపంగా మారింది. భార్యపై అనుమానం మరింత పెంచుకున్న అతడు శిరీషను హత్య చేయాలని భావించాడు. గురువారం భార్యను హత్య చేసి తనకు ఏమీ తెలియదన్నట్లుగా బయటకు వెళ్లిపోయాడు. వీరికి బంధువులు ఫోన్ చేయగా ఎవరూ స్పందించడం లేదని అనుమానమొచ్చి ఇంటికి వెళ్లి చూశారు. తాళం వేసి ఉంది. సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తాళం పగలగొట్టి చూడగా విగతజీవిగా పడి ఉన్న శిరీష వారికి కనిపించింది. భార్యను హత్య చేసి సంతోష్ ఎక్కడికో వెళ్లిపోయాడని, అందుకు ఫోన్ తీయడం లేదని అర్థమవుతోంది.
బంధువుల ఫిర్యాదుతో శిరీష హత్య కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంతోష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. భార్యపై అనుమానంతో సంతోష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఫోన్లో మాట్లాడినా అనుమానించే వాడని, భార్యతో గొడవలు పెద్దవి కావడంతో శిరీషను హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో