Nellore Crime: ట్రీట్మెంట్ కోసం వెళితే దారుణం.. మతిస్థిమితం లేని మహిళ సజీవ దహనం..
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని మహిళ అగ్నికీలలకు ఆహుతయ్యింది. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట లోని దర్గా సమీపంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని మహిళ అగ్నికీలలకు ఆహుతయ్యింది.- చికిత్స కోసం వెళితే ఏకంగా ప్రాణాలు పోయిన ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్ పేట లోని దర్గా సమీపంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైంది, ఇదే ప్రమాదంలో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అసలు కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట లోని ఖాజా రహంతుల్లా దర్గాకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దర్గా గంధమహోత్సవం, ఉర్సు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా మతి స్తితమితం లేనివారిని ఇక్కడకు తీసుకొస్తే నయమవుతుందని నమ్మకం. అందుకే ఎక్కువగా ఇక్కడికి మతి స్థిమితం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి దర్గాలో ప్రార్థనలు చేయిస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తాజాగా మంటల్లో కాలి బూడిదైన మహిళ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
ఇటీవలే హైదరాబాద్ కు చెందిన కుటుంబం నెల్లూరు ఏఎస్ పేట దర్గాకు వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల్లో 47 సంవత్సరాల ఫాతిమా అనే మహిళకు మతి స్థిమితం సరిగా లేదని దర్గాలో ఇటీవల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడే చికిత్స నిమిత్తం ఉంచారు. దర్గాకు దగ్గరే అద్దెకు గదులు కూడా ఇస్తుంటారు. అక్కడే కొంతమందిని వదిలేసి నయం అయిపోయిన తర్వాత తీసుకెళ్తామని చెబుతుంటారు కుటుంబ సభ్యులు. కానీ చివరికి ఇలా విషాదం జరుగుతుందని ఆ ఫ్యామిలీ ఊహించలేదు.
కొంతమంది మాత్రం కుటుంబంతో కలసి కొన్ని రోజులు దర్గా ప్రాంతంలోనే ఉంటారు. ఈ క్రమంలో ఫాతిమా అనే మహిళ కూడా అక్కడే ఓ పూరి గుడిసెలో ఉంటోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఆ గుడిసె దగ్ధమై, ఫాతిమా మంటల్లో కాలి బూడిదైంది. ఇదే ఘటనలో మరొకరికి గాయాలైనట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లకపోతే ప్రాణాలతో అయినా ఉండేదని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Also Read: NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!