NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!
ఈ నియోకోవ్ ను దక్షిణాఫ్రికాలో తొలుత గబ్బిలాల్లోనే గుర్తించారు. ఆ గబ్బిలాల జనాభాలోనే ఇది వ్యాప్తి చెందుతోందని భావించారు.
ఇప్పటికే కరోనా వైరస్ ధాటికి జనం విలవిలలాడుతుంటే.. మరో పిడుగులాంటి వార్తను చైనాలోని ఊహాన్ శాస్త్రవేత్తలు చెప్పారు. అసలు ఈ కరోనా వైరస్ 2019లో చైనాలోని ఊహాన్ నగరంలోనే బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కడి శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఎదురు కానున్న భారీ ముప్పు గురించి బయటపెట్టారు. దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ యొక్క కొత్త రూపాంతరం ‘నియోకోవ్’ (NeoCov) బయటపడిందని.. ఇది గత వేరియంట్ల మాదిరిగా కాకుండా అత్యధిక స్థాయిలో మరణాల రేటు, వ్యాప్తి తీవ్రత నమోదు చేస్తుందని హెచ్చరించారు. ఊహాన్ శాస్త్రవేత్తలు ఈ హెచ్చరిక చేసిన విషయాన్ని రష్యాకి చెందిన న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. ‘నియోకోవ్’ అనేది కొత్తది కాదు. మెర్స్-కోవ్ వైరస్ రకానికి చెందిందే. మధ్య ప్రాచ్య దేశాల్లో 2012-15 మధ్య కాలంలోనే దీన్ని కనుగొన్నారు. ఈ మెర్స్-కోవ్ రకం కూడా మనుషుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సార్స్-కోవ్-2 రకంతో సరిపోలుతుంది.
ఈ నియోకోవ్ ను దక్షిణాఫ్రికాలో తొలుత గబ్బిలాల్లోనే గుర్తించారు. ఆ గబ్బిలాల జనాభాలోనే ఇది వ్యాప్తి చెందుతోందని భావించారు. కానీ, తాజా పరిశోధనలో మాత్రం నియోకోవ్‌తో పాటు దాని దగ్గరి అనుబంధ వైరస్ ‘పీడీఎఫ్-2180-కోవ్’ మనుషులకూ వ్యాప్తి చెందుతుందని తేలింది. ఈ పరిశోధన వివరాలను bioRxiv అనే వెబ్ సైట్‌లో ప్రచురించారు.
వూహాన్ యూనివర్సిటీ నిపుణులు, చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఫిజిక్కస్ పరిశోధకులు గుర్తించిన వివరాల ప్రకారం.. గబ్బిలాల్లో గుర్తించిన వైరస్ ఇంకా ఓ మ్యుటేషన్ చెందడం ద్వారా మనుషుల్లో కూడా వ్యాప్తికి కారణమవుతుందని కనుగొన్నారు. కరోనా వైరస్ పాథోజెన్ (వ్యాధికారకం)కు భిన్నంగా ACE2 రిసెప్టర్‌తో కలవడం వల్ల కొత్త కరోనావైరస్ ప్రమాదాన్ని కలిగిస్తుందని పరిశోధన ఫలితాలు తేలాయి. దీని ఫలితంగా, మనుషుల్లో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు లేదా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నవారు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు లేదా ప్రోటీన్ అణువులు నియోకోవ్ నుండి రక్షించలేవని స్పష్టమైంది.
చైనా పరిశోధకుల ప్రకారం, నియోకోవ్ అనేది MERS-high CoV హై పొటెన్షియల్ కాంబినేషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో మరణాల రేటు (ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం) మరియు ప్రస్తుత SARS-CoV-2 కరోనావైరస్ యొక్క అధిక వ్యాప్తి రేటు కలిగి ఉంటుందని రష్యన్ స్టేట్ వైరాలజీ, బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిపుణులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
“నియోకోవ్ కరోనా వైరస్‌పై చైనీస్ పరిశోధకులు పొందిన డేటా గురించి వెక్టర్ రీసెర్చ్ సెంటర్‌కు తెలుసు. మానవులలో వేగంగా వ్యాప్తి చెందగల కొత్త కరోనావైరస్ యొక్క ఆవిర్భావం ప్రస్తుతానికి సమస్య కాదు. అది చేయబోయే ప్రమాదాలను మరింత అధ్యయనం చేసి మరింత పరిశోధించాల్సిన అవసరం ఉంది’’ అని స్పుత్నిక్ వార్తా సంస్థ కథనంలో పేర్కొన్నారు.