CDS Anil Chauhan: సరిహద్దుకు ప్రజలే నిఘా నేత్రాలు.. కాపాడుకోవాలని సీడీఎస్ విజ్ఞప్తి
సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఉత్తరాఖండ్ చాలా సున్నితమైన, ముఖ్యమైన రాష్ట్రమని.. చైనా సరిహద్దులో నిత్యం అలర్ట్‌గా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సూచించారు.

Chief of Defence Staff (CDS) in Uttarakhand: సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఉత్తరాఖండ్ వ్యూహాత్మకంగా చాలా సున్నితమైన, ముఖ్యమైన రాష్ట్రమని.. చైనా సరిహద్దులో నిత్యం అప్రమత్తత, జాగ్రత్త అవసరమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సూచించారు. ఓ మాజీ సైనికుడు మృతిచెందగా శనివారం నిర్వహించిన ర్యాలీలో సీడీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాఖండ్ చైనాతో 350 కిలోమీటర్ల సరిహద్దు, నేపాల్‌తో 275 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోందని, అందుకే ఈ రాష్ట్రం భద్రతా దృష్ట్యా సున్నితమైన, వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు.
చైనాతో విభేదాలు కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తాయి
‘చైనాతో సరిహద్దుగా ఉన్న ఉత్తరాఖండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల కొన్నిసార్లు ఉత్తరాఖండ్ సరిహద్దు రాష్ట్రమని మనం మరచిపోతాం. నియంత్రణ రేఖ, సరిహద్దుకు సంబంధించి చైనాతో మనకు కొన్ని విభేదాలు ఉన్నాయని, కొన్నిసార్లు ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. బారాహోటి ప్రాంతం ఇందుకు ఉదాహరణ. అందువల్ల, మనమందరం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి’ అని జనరల్ చౌహాన్ అన్నారు.
అప్రమత్తంగా ఉంటే సరిహద్దులు మరింత పటిష్టం
సరిహద్దు ప్రాంతాల ప్రజలు భద్రత విషయంలో చురుగ్గా ఉండాలని, సరిహద్దు నిఘా కేవలం సైన్యం బాధ్యత మాత్రమే కాదని, స్థానిక ప్రజల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమని CDS విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలను, ముఖ్యంగా వెటరన్స్‌ను ‘కళ్ళు’ అని సంబోధించారు. అప్రమత్తంగా ఉంటే సరిహద్దులు మరింత బలంగా ఉంటాయని సీడీఎస్ అన్నారు.
ఉత్తరాఖండ్‌లోనూ ఆ వ్యవస్థను అమలు చేస్తాం
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లోని సహకార సంఘాలు సైన్యానికి ఆహారాన్ని సరఫరా చేసినట్లే, ఉత్తరాఖండ్‌లో కూడా ఇలాంటి వ్యవస్థను అమలు చేస్తామని జనరల్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాడి మరియు పశుసంవర్ధక ఉత్పత్తులను సహకార సంఘాల నుంచి సేకరిస్తున్నారని, భవిష్యత్‌లో వారి నుంచి తాజా రేషన్‌ను కూడా సేకరిస్తారని వెల్లడించారు. ఇది సరిహద్దు ప్రాంతాలకు సజావుగా సరఫరాను నిర్ధారించడమే కాకుండా స్థానిక ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కూడా అందిస్తుందని CDS స్పస్టం చేశారు.





















