Hyderabad Crime : పగలు ఆటోలో తిరుగుతూ రెక్కీ, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!
Hyderabad Crime : పగలు ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తూ తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడ్ని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad Crime : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పగలు ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసికొని చోరీలు చేస్తున్నాడు. తాళం పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశామని హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమానాస్పద రీతిలో నెంబర్ లేని ఆటోలో తిరుగుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పాతనేరస్థుడు హేమంత్ సాయి(19)గా గుర్తించారు.
నిందితుడిపై పలు కేసులు
నిందితుడు సాయిపై పేట్ బషీరాబాద్ పీఎస్ లో నాలుగు కేసులు, ఆల్వాల్ పీఎస్ పరిధిలో రెండు కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఆల్వాల్ కు చెందిన నాగెళ్ళి హేమంత్ సాయి (19) గతంలో చిలకలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలలో బాల నేరస్థుడిగా అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హేమంత్ సాయి వద్ద నుంచి ఆరు ల్యాప్‌టాప్ లు, నాలుగు లక్షల నగదు స్వాధీనం చేసుకొని నిందితుని రిమాండ్ కు తరలించారు.
సీసీ కెమెరాల ఆధారంగా
"నవంబర్ 16న పగటి పూట దొంగతనం జరిగినట్లు ఓ ఫిర్యాదు వచ్చింది. ఇంటి యాజమాని తాళం వేసుకుని బయటకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ లో దొరిగిన ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. నిందితుడిది వరంగల్ కాశీబుగ్గ స్వగ్రామం. అతడు గత రెండు మూడేళ్లుగా నగరంలోని పలు దొంగతనాలు చేశాడు. చిలకలగూడా పీఎస్ లో బాలనేరస్థుడిగా రిమాండ్ కు వెళ్లాడు. ప్రస్తుతం మేజర్ అయిన సాయి దొంతనాలు కొనసాగించాడు. నిందితుడిపై ఆరు కేసులు ఉన్నాయి. నిందితుడి నుంచి ఆరు ల్యాప్ టాప్ లు, నాలుగు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. " - రామలింగరాజు, ఏసీపీ పేట్ బషీరాబాద్
వంట పని కోసం వచ్చి చోరీలు
వంట పని (Cooking Job) కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన దొంగను హన్మకొండ సీసీఎస్ పోలీసులు (Hanamkonda CCS Police) అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి పోలీసులు రూ.2.5 లక్షల విలువ గల ఒక ఖరీదైన ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి (Warangal CP Tarun Joshi) వివరాలను వెల్లడించారు. ‘‘నిందితుడు షేక్ ఫయాజ్ (23), గాజీపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన వాడు. నిందితుడు గత పది రోజుల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ (Hyderabad News) కు వచ్చి నివాసం ఉంటున్నాడు. హన్మకొండకు (Hanamkonda News) చెందిన హోటల్ నిర్వహకుడికి నిందితుడు వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యాడు. తాను నిర్వహిస్తున్న హోటల్ వంట మనిషిగా పనిచేయాల్సిందిగా హోటల్ యజమాని నిందితుడికి చెప్పడంతో నిందితుడు గత అక్టోబర్ 23వ తేదీన హన్మకొండకు (Hanamkonda News) చేరుకున్నాడు.
రాత్రుళ్లు చోరీలు
హోటల్ యజమాని సూచన మేరకు హన్మకొండ బస్టాండ్ (Hanamkonda Bus Stop) సమీపంలోని కిరాయిలో గదిలో నిందితుడు ఉన్నాడు. అదే గదిలో హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ఉన్నారు. వీరి వద్ద ఒక ఖరీదైన ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్ టాప్ ఉండదాన్ని నిందితుడు గమనించాడు. నిందితుడు అదే రోజు రాత్రి హోటల్ యజమాని కిరాయి గదిలో మిగతా వ్యక్తులతో కలిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించాడు. అనంతరం గదిలో మిగతా ఇద్దరు వ్యక్తులు నిద్రపోవడంతో నిందితుడు సదరు వ్యక్తులకు చెందిన ఖరీదైన ద్విచక్ర వాహనంతో పాటు ల్యాప్ టాప్ ను చోరీ చేశాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. రాత్రి వేళ జరిగిన దొంగతనంపై బాధితులైన యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుని పట్టుకొనేందుకు విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు నేడు (నవంబరు 22) ఉదయం హన్మకొండ (Hanamkonda News) ప్రాంతంలో చోరీ చేసిన ల్యాప్ టాప్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించారు. అలా నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారణ చేశారు. తాను పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.