Hyderabad: మూడేళ్ల చిన్నారి మలద్వారంలోకి ఇనుప రాడ్, కన్నతల్లిదే అసలు ప్లాన్! ఆమె ప్రియుడు ఘోరం
వారి ఏకాంతానికి భంగం కలుగుతుండడంతో ఆ కోపం పిల్లాడిపై చూపించేవారు. మొత్తానికి కొడుకును అడ్డు తొలగించుకోవాలని తల్లి భావించింది.
క్షణికమైన శారీరక సుఖాల కోసం మొదలైన అనైతిక బంధం, కన్న కొడుకుని అత్యంత కిరాతకంగా పొట్టనపెట్టుకునేందుకు కారణమైంది. మూడేళ్ల బాలుడిపై అసహజ రీతిలో లైంగిక క్రియ జరిపి, చిన్నారి మలద్వారంలోకి బలమైన వస్తువు చొప్పించి మరీ చంపారు. ఈ ఘాతుకానికి కన్న తల్లే ప్రధాన సూత్రధారి కాగా, ఈ పని చేసింది ఆమె ప్రియుడు అని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ అమానుషమైన ఘటన 50 రోజుల కిందట జరగ్గా తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని రామ్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ముషీరాబాద్ పోలీసులు మీడియాకు వివరించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సమీపంలో ధర్మారానికి చెందిన దంపతులు ముస్తాల శివకుమార్, పొనగంటి నాగలక్ష్మి ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. కొంతకాలంగా రామ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు స్కూల్ కు వెళ్తున్నాడు. చిన్న కొడుకు సమీపంలోని అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లొస్తున్నాడు. మరోవైపు, వాళ్ల ఊరికే చెందిన ముస్తాల రవి దంపతులు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ రవికి, నాగలక్ష్మికి పాత పరిచయం ఉంది. రెండు నెలల క్రితం రవి భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో రవి నాగలక్ష్మి దంపతుల నివాస సమీపానికి మకాం మార్చాడు. నాగలక్ష్మి భర్త పనికి వెళ్లగా, వీరిద్దరూ వివాహేతర సంబంధం నెరిపేవారు. నాగలక్ష్మి మూడేళ్ల చిన్న కుమారుడు రోజూ మధ్నాహ్నమే అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చేవాడు. వారి ఏకాంతానికి భంగం కలుగుతుండడంతో ఆ కోపం పిల్లాడిపై చూపించేవారు. మొత్తానికి ఆ బాలుడ్ని అడ్డు తొలగించుకోవాలని చూశారు.
మలద్వారంలోకి ఇనుప వస్తువు!
గత నెల 8న భర్త శివ కుమార్ ను పని కోసం భార్య బయటికి తీసుకెళ్లింది. ప్రియుడికి సమాచారం ఇచ్చి, ముందస్తు ప్లాన్ ప్రకారం రవి ఇద్దరు పిల్లల్ని రామ్ నగర్ లోని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే తాగి ఉన్న నిందితుడు రవి మూడేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత బలమైన ఇనుప వస్తువును బాలుడి మలద్వారంలోకి దూర్చాడు. బాగా కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. ఒంటిపై దుస్తులను మార్చేసి, బాలుడు కుర్చీపై నుంచి కింద పడ్డాడని నాటకం ఆడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు అక్కడికి వచ్చి బాలుడ్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
అంతర్గతంగా రక్తస్రావం
బాలుడి తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. పోస్టు మార్టం నివేదికలో బాలుడి మలద్వారంలోకి బలమైన వస్తువు చొప్పించినట్లుగా, అంతర్గతంగా రక్త స్రావం జరిగి మరణించినట్లుగా తేల్చారు. తలకు తగిలిన దెబ్బ కూడా బలంగా కొట్టారని, కుర్చీపై నుంచి పడితే అలాంటి దెబ్బ తగలదని నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు తల్లిని, రవిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.