Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన, పాత కక్షలతో యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన స్నేహితులు
Hyderabad Crime : హైదరాబాద్ నగరంలో పాతకక్షలతో పెట్రోల్ దాడి జరిగింది. ఎర్రగడ్డ ఆసుపత్రి గ్రౌండ్ లో ఇద్దరు పాత నేరస్థులు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.
Hyderabad Crime : హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఇద్దరు స్నేహితులు కలిసి ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆలయంలోని ఓపెన్ గ్రౌండ్లో బయట నుంచి వచ్చిన పాత నేరస్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పాత కక్షలతో ఆదిల్ అనే యువకుడిపై ఆజర్, మొహ్మద్ అలీ పెట్రోల్ పోసి నిప్పంటించారు. గతంలో ఆజర్, మొహ్మద్ అలీలపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆదిల్ కు 90 శాతం గాయాలు అయ్యాయి. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షలతో ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి కొందరు యువకులు బయట నుంచి ఆస్పత్రి ఓపెన్ గ్రౌండ్లో ముందస్తు ప్రణాళికతో ఆదిల్ అనే యువకుడిపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో వైసీపీ నేతపై పెట్రోల్ తో దాడి
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వైసీపీ నేత వెంకట సుబ్బారెడ్డిపై సుజన అనే మహిళ పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. ఈ దాడిలో వెంకట సుబ్బారెడ్డి, ఆయన భార్య సునీతకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తిలో ఉంటున్న వైసీపీ నేత వెంకట సుబ్బారెడ్డి శనివారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోతుండగా సుజన అనే మహిళ ఇంట్లోకి వెళ్లి భార్య భర్తలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది.
పదేళ్ల క్రితం కత్తితో దాడి
మంటలు అంటున్న భార్యా భర్తలిద్దరూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో వెంకట సుబ్బారెడ్డి ఆయన భార్య సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వారి ఇల్లు కూడా పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చించారు. రేషన్ షాపు డీలర్ షిప్ రద్దు చేయించాడనే కోపంతో ఇదే మహిళ 10 ఏళ్ల క్రితం వెంకట సుబ్బారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. అప్పట్లో వెంకట సుబ్బారెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. అదే మహిళ మరోసారి సుబ్బారెడ్డిపై హత్యాయత్నం చేసి పరారయ్యింది. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ కోసం గాలిస్తున్నారు.