Hyderabad Crime News: కొట్టేసిన వజ్రాలను మూలన పడేసిన దొంగలు- కారణం తెలిసి షాక్ తిన్న పోలీసులు!
Hyderabad Crime News: జల్సాలకు అలవాటు పడ్డ ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ లో దొంగతనం చేశారు. కోటి రూపాయల బంగారం, డైమండ్స్ దోచేసి గోల్డ్ అమ్మేశారు. వజ్రాలను మాత్రం ఇంట్లో మూలన పడేసి గోవా చెక్కేశారు.
Hyderabad Crime News: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. ఫుల్లుగా తాగడం తిరగడం అలవాటు చేసుకున్న వారిద్దరూ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనకున్నారు. ఈ క్రమంలోనే ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవలే ఓ డైమండ్స్ వ్యాపారి ఇంట్లో చోరీ చేశారు. కోటి రూపాయల విలువైన డైమండ్స్, బంగారాన్ని దోచేశారు. దోచుకున్న సొత్తులో బంగారాన్ని అమ్మేశారు. వజ్రాల విలువ తెలియక వారుండే గదిలోని ఓ మూలన పడేశారు. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో ఓ వ్యక్తి గోవాకు పారిపోయి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. విషయం గుర్తించిన పోలీసులు గోవాకు వెళ్లి మరీ అతడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ ఫిలిం నగర్‌లో ఈనెల 20వ తేదీన రాత్రి డైమండ్స్ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అంజిని బంజారాహిల్స్ డివిడన్ క్రైం పోలీసులు సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. చింతలబస్తీకి చెందిన చాపల అంజలప్ప అలియాస్ మచ్చ అంజి స్థానిక చేపల మార్కెట్ లో పని చేసేవాడు. బంజారాహిల్స్ లోని సింగాడికుంటకు చెందిన మైలారం పవన్ కుమార్ తో స్నేహం, జల్సాలకు దారి తీసింది. గంజాయితోపాటు మద్యం సేవించడం, తిరగడం అలవాటు చేసుకున్న వీరిద్దరూ దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఈనెల 20వ తేదీన రాత్రి నంబర్ ప్లేటు లేని స్కూటీపై వీధుల్లా తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుతుండగా ఓ ఇంటిని గుర్తించారు. ఇద్దరూ కలిసి ఇంటి వెనక కిటికీ నుంచి లోపలికి దూరి నగదు, నగలు కోసం వెతికారు.
ఈ క్రమంలోనే ఓ లాకర్ తీసుకొని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని ఓ శ్మశాన వాటికలో పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలు, వజ్రాలను పంచుకున్నారు. దొంగతనం జరిగిన రెండు రోజుల తర్వాత పవన్ కుమార్ పోలీసులకు చిక్కాడు. అదే రోజు అంజిని పట్టుకోవడానికి యత్నించగా.. పోలీసుల కదలికలను గుర్తించిన అతను తన వద్ద ఉన్న అభరణాలను మణప్పురంలో తాకట్టు పట్టి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. లక్డీకాపూల్ లో బస్సు ఎక్కి బెంగళూరులో దిగి అక్కడి నుంచి గోవాకు చెక్కేశాడు. పవన్ కుమార్ ను విచారించగా ఎంతకూ సహకరించలేదు. ఈ క్రమంలోనే అతడి చేయిపై ఉన్న ఓ ఫోన్ నెంబర్ ను పోలీసులు గుర్తించారు. అది ఎవరిదని విచారించగా.. అంజలప్ప అనే పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఆ నంబర్ ను ఆధారంగా చేసుకొని చోరీ జరిగిన రాత్రి టవర్ డంప్ పరిశీలించగా అక్కడే రెండు గంటల పాటు తిరిగినట్లు గుర్తించారు.
ఆ నెంబర్ ఆధారంగా నిందితుడు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు గోవాకు వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. అయితే బంగారాన్ని అమ్మేసిన నిందితుడు.. వజ్రాల విలువ తెలియక వాటిని ఓ డబ్బాలో వేసి ఇంట్లో ఓ మూలన పడేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే అతడు ఉండే రూంకు వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నారు.