Tirupati Crime: సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి మరీ తిరుపతిలో 4 ఇళ్లల్లో చోరీ - ఎంత బంగారం ఎత్తుకెళ్లారంటే..
Tirupati Robbery Case: తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసిన మరీ బంగారు ఆభరణాలు అపహరించారు.

Tirupati Robbery : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా దొంగతనాలు మాత్రం ఆగట్లేదు. సెక్యూరిటీ, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ లాంటివి ఏవీ ఇంట్లో ఉన్న సొమ్మును రక్షించలేకపోతున్నాయి. రోజుకో కొత్త ప్లాన్ తో దొంగలు అంతకంతకు అప్డేట్ అవుతూ దోపిడీలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంతో సెక్యూరిటీ ఉండే వీఐపీల ఇళ్లలోనూ చోరీలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తిరుపతిలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఒకేసారి 4 ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి మరీ దొంగతనం చేశారు. దొంగలు దాదాపు 1.48 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
తిరుపతిలోని సీపీఆర్ విల్లాలో జరిగిన ఘటన నగరాన్ని భయాందోళనకు గురి చేసింది. నాలుగు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. భారీ మొత్తంలో బంగారం దోచుకెళ్లారు. శనివారం అర్థరాత్రి సమయంలో ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి ఆయా ఇళ్లలోకి దుండగులు అక్రమంగా ప్రవేశించారు. అలా వరుసగా 80, 81, 82, 83 ప్లాట్లలో తమ చేతి వాటం ప్రదర్శించారు. 81వ ప్లాట్ లో మేఘనాధ రెడ్డి ఇంటిపైన నిద్రిస్తుండగా కింద అంతస్తులో 1 కేజీ బంగారం ఆపహరించారు. 82వ ప్లాట్ లో కేశవులనాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంటి నుంచి 48 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు చోరీ చేశారు. ఇక 80, 83 ప్లాట్లను ఆ ఇళ్ల యజమానులు గెస్ట్ హౌస్ గా వినియోగించుకుంటున్నారు. దుండగులు ఆ ఇండ్ల తలుపులు సైతం బద్దలు కొట్టి, లోనికి ప్రవేశించారు. అలా మొత్తం సుమారు 1.48 కిలోల బంగారు అపహరణకు గురైంది.
ఆ తర్వాత ఉదయాన్నే దొంగతనం జరిగిందన్న విషయాన్ని గుర్తించిన ఆయా కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని చెప్పడంతో.. సమాచారమందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని, ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Also Read : Pawan Kalyan: కేంద్రం సాహసోపేత నిర్ణయం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం: బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్




















