Hawala Money Seized: జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టివేత, 90 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hawala Money Seized: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 90 లక్షల రూపాయలను జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Hawala Money Seized: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరుతో హోరెత్తిస్తున్నాయి. మునుగోడు పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నట్లు సమాచారం. అందుకే మునుగోడు నియోజకవర్గానికి రాష్ట్రం నలుమూలల నుంచి నగదు సరఫరా అవుతోంది. దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది.
తాజాగా హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడు నంబర్ - 71లో భారీగా నగదు పట్టుబడింది. TS 27 D 7777 నెంబర్ తార్ జీపులో వెళ్తున్న ఓ వ్యక్తి.. అక్రమంగా తరలిస్తున్న 89 లక్షల 92 వేల రూపాయలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నగదుతో పాటు సదరు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జూచ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
వారం రోజుల క్రితం నార్సింగి వద్ద 65 లక్షలు పట్టివేత
రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద కోటి, ఇబ్రహీంపట్నం వద్ద 65 లక్షల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. నార్సింగి వద్ద పట్టుబడ్డ కోటి రూపాయల తరలింపు వెనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధువులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం ఎన్జీవో కాలనీకి చెందిన దేవర్ రాజు, కార్వాన్ కు చెందిన శ్రీకాంత్ సాగర్ వెంకట్ ఫామ్స్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అయితే ఇదే సంస్థలో పని చేసే విజయ్ కుమార్, దేవులపల్లి నగేష్, దాసర్ లూథర్ లు కలిసి రెండు కార్లు, ద్విచక్ర వాహనాల్లో మూడు భాగాలుగా తరలిస్తున్న కోటి రూపాయల నగదు పట్టుబడింది.
అయితే ఈ హవాలా డబ్బులను మునుగోడుకు తరలిస్తున్నట్లు పోలీసులు విచారణలో బయట పడింది. తనిఖీల సమయంలో వాహనాలు ఆపకుండా వెళ్లిపోవడంతో.. పోలీసులు చేజ్ చేసి మరీ వాటిని పట్టుకున్నారు. ఈ సొమ్మును మునుగోడులోని కోమటిరెడ్డి రాజేందర్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సుమంత్ రెడ్డికి అందజేయడానికి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోమటి రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి, సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి, సునీల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కారులో తరలిస్తున్న 64 లక్షల 63 వేలు రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడుకు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో వాహనాన్ని తనిఖీ చేయగా... నగదుతో దొరికిపోయారు. సొమ్ము తీసుకువెళ్తున్న వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించి డబ్బును తీసుకెళ్లాలని పోలీసులు వారికి సూచించారు.
పదిహేను రోజుల క్రితం కోటి రూపాయలు..
నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉప ఎన్నికల్లో భాగంగా కోటి రూపాయల హవాలా డబ్బును పోలీసులు గుర్తించారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించగా... బీజేపీకి చెందిన ఓ నేత వాహనంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బీజేపీ నేత కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వేణు వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు డబ్బుపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.