Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!
Guntur Knife Attack : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది దాడిలో డెంటల్ విద్యార్థినికి తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో దారుణం ఘటన జరిగింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. డెంటల్ విద్యార్థినిపై ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. తపస్వి అనే విద్యార్థినిపై దాడి చేసిన జ్ఞానేశ్వర్ ఆ తర్వాత తన చేయి కోసుకున్నాడు. జ్ఞానేశ్వర్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి మృతి చెందింది. అయితే నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పెదకాకాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడు జ్ఞానేశ్వర్ అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
విజయవాడకు చెందిన జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తపస్వితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తక్కెళ్లపాడులోని ఓ డెంటర్ కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు తన వద్దకు రమ్మని పిలిచింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్ద ఉంటుంది. తపస్విపై పగపెంచుకున్న జ్ఞానేశ్వర్ ఆమె హతమర్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు ఇద్దరికీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు ఉన్మాదిలా మారిపోయి తపస్విపై దాడి చేసి సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోశాడు. పక్కనున్న తపస్వి స్నేహితురాలు కేకలు వేసి బయటకు పరిగెట్టడంతో స్థానికులు వచ్చారు. దీంతో తలుపులు మూసేసి కొనఊపిరితో ఉన్న తపస్విని రక్తపు మడుగులో ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి తపస్విని ఆసుపత్రికి తరలించారు. తపస్వీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. తపస్వీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. తపస్వీపై సర్జికల్ బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేసిన తరువాత, తాను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు ఏమన్నారంటే..
కృష్ణా జిల్లాకు చెందిన తపస్వీ వైద్య విద్యార్థిని, కాగా జిల్లాకే చెందిన జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా చేస్తున్నాడు. వీరిద్దరికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారిందని పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తపస్వీ అతడికి దూరంగా ఉంటోంది. నెల రోజుల కిందట ప్రియుడు జ్ఞానేశ్వర్ పై వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనను పెళ్లిచేసుకోదని భావించి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆమెను హత్య చేయాలని భావించాడు. ప్లాన్ ప్రకారం ఆమెను వెంబడించి, తనకు ఎలాగూ దక్కదని ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
విశాఖలో మహిళ దారుణ హత్య
విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. వాటర్ డ్రమ్ములో మహిళ మృతదేహం కనిపించింది. ఇది గమనించిన ఇంటి ఓనర్ భయాందోళనకు గురయ్యాడు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మహిళను హత్య చేసి కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంటి ఓనర్, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పిఎంపాలెం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 24 గంటలు గడవకముందే నగరంలో రెండు హత్యల సంఘటనలు జరగడంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.