టూర్ వెళ్లేటప్పుడు మీరు ఇలా చేస్తున్నారేమో చూసుకోండి? జాగ్రత్త పడండి!
గుంటూరు జిల్లా మంగళదాస్‌నగర్‌కు చెందిన షేక్ ఇబ్రహీం ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని పార్ట్‌టైం జాబ్‌గా చోరీలు చేయడం మొదలు పెట్టాడు.
టూర్‌లకు వెళ్లేటప్పుడు ఏదో వెహికల్ బుక్ చేసుకొని వెళ్తాం. లేదంటే షేర్డ్ వెహికల్స్‌లో రైల్వేస్టేషన్, బస్టాండ్ వరకు చేరిపోతాం. ఇంటికి సమీపంలో ఉంటే నడుచుకుంటూ వెళ్లిపోతాం. అలా వెళ్లిపోతున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటాం. మీకు తెలియకుండానే ఎక్కడి వెళ్తున్నారు... ఎప్పుడు వస్తారు లాంటివి చర్చించుకుంటారు. మరికొందరైతే... ఆ పొరుగు వాళ్లుకు ఈ ఇరుగు వాళ్లకు చెప్పి మరీ వెళ్తారు. రోడ్డుపై నిలబడి కేకలు వేసి మరీ చెబుతారు. మేం ఊరెళ్తున్నాం... వచ్చేసరికి రెండు మూడు రోజులు పడుతుందీ... ఇళ్లు జాగ్రత్తా అని చెబుతుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది.
గుంటూరు జిల్లా మంగళదాస్‌నగర్‌కు చెందిన షేక్ ఇబ్రహీం ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోవడం లేదని పార్ట్‌టైం జాబ్‌గా చోరీలు చేయడం మొదలు పెట్టాడు. ఇతనిపై ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో నాలుగు ఆటోలు ఎత్తుకెళ్లిన కేసు, పెదకాకానిలో ఓ ఆటో దొంగిలించిన కేసు ఉంది. నగరపాలెంలో రెండు ఆటోలు చోరీ చేశాడు. ఈ కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
జైలుకు వెళ్లాడు కానీ... బుద్ది మాత్రం మారలేదు. చోరీ చేయాలన్న దుర్బుద్ది పోలేదు. ఆటో నడుపుతూనే చోరీలు చేస్తూ వచ్చాడు.
వారంరోజుల క్రితం నెహ్రూగనర్‌కు చెందిన లక్ష్మీ తన ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్లారు. బస్టాండ్ వెళ్తుంటే.. మధ్యదారిలో ఇబ్రహీం ఆటో కనిపించింది. అతని స్వభావం తెలియని లక్ష్మీ ఫ్యామిలీ ఆటో ఆపి ఎక్కారు. మార్గమధ్యలో మాట్లాడుకుంటున్నారు.
వారి మాటలు జాగ్రత్తగా వింటున్న ఇబ్రహీం... వాళ్లంతా హైదరాబాద్ వెళ్తున్నారని పసిగట్టాడు. అంతే వాళ్ల ఇంట్లో చోరీకి ప్లాన్ చేశాడు.
వాళ్లు ఊరు వెళ్లిన రాత్రే లక్ష్మీ ఇంట్లో చోరీ చేశాడు. ఇనుప బీరువా, కబోర్డు తలుపులు తొలగించి బంగారం వెండి, నగదును దొంగిలించాడు.
తెల్లవారి తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన స్థానికులు లక్ష్మీఫ్యామిలీకి విషయాన్ని చేరవేశారు. దీంతో కంగారు పడుతూ హైదరాబాద్ నుంచి వచ్చేసిందా ఫ్యామిలీ. వచ్చి చూస్తే ఇంట్లో ఉంచిన బంగారం, వెండి, నగదు కనిపించడం లేదు.
దొంగతనం జరిగిందని నిర్దారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు...సీఐ శ్రీనివాసులు రెడ్డి దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా ఏర్పడి ఆధారాలు సేకరించారు. పాతనేరస్థుడి పనిగా భావించి అతని కోసం గాలించారు.
చోరీ చేసిన సొత్తు అమ్మేందుకు ఇబ్రహీం లాలాపేట పూల కొట్ల వద్ద విక్రయిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు చేరుకొని అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన బంగారం, రెండు కిలోల 600 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని ఎస్పీ రివార్డులు అందజేశారు.