Goa Temple Stampede: గోవాలోని ఆలయం జాతరలో అపశ్రుతి, తొక్కిసలాటలో ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
Shirgao Shree Lairai Devi Jatrotsav | గోవాలోని శిర్గావ్ లోని ఆలయ ఉత్సవంలో జరిగిన దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Goa Temple Stampede: గోవాలోని ఓ దేవాలయం ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున జనం రావడంతో రద్దీని కంట్రోల్ చేయలేకపోవడంతో తొక్కిసలాటకు దారితీసి విషాదం నెలకొంది. గోవాలోని శిర్గావ్ శ్రీ లైరాయి దేవి దేవాలయ ఉత్సవంలో శుక్రవారం జనం ఒక్కసారిగా పరుగులు తీయడం వల్ల తొక్కిసలాటకు దారితీసి, కనీసం ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు గాయపడ్డారని ఉత్తర గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గోవా మెడికల్ కాలేజ్, ఉత్తర గోవా జిల్లాలోని మపుసా ఆసుపత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో కిందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జాతర లాంటి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే ప్రభుత్వం ఈ వేడుక కోసం తగిన ఏర్పాట్లు చేయలేదా, జాగ్రత్తలు తీసుకోలేదా అని విమర్శలు తలెత్తుతున్నాయి.
Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. 🙏@DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/7kL6uNkBEi
— Goa Congress (@INCGoa) May 3, 2025
తొక్కిసలాటపై కాంగ్రెస్ తీవ్ర విచారం
జాతర వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. షిర్గావ్‌లోని శ్రీ లైరాయ్ దేవి జాతరలో జరిగిన తొక్కిసలాటపై గోవా కాంగ్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతిచెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
1000 మంది పోలీసులను మోహరించిన ప్రభుత్వం
శ్రీ దేవి లైరాయ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఒక్కసారిగా భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్ర కోసం ప్రభుత్వం దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించింది. జనసమూహం కదలికలను పర్యవేక్షించడానికి డ్రోన్‌లను కూడా ఏర్పాటు చేశారు. తొక్కిసలాట అనంతరం శుక్రవారం ముఖ్యమంత్రి సావంత్, ఆయన సతీమణి సులక్షణ, రాజ్యసభ సభ్యుడు సదానంద్ షెట్ తనవాడే, ఎమ్మెల్యేలు కార్లోస్ ఫెరీరా, ప్రేమేంద్ర షెట్ జాతరలో విషాదం నెలకొన్న ఆ స్థలాన్ని పరిశీలించారు.
తొక్కిసలాట వెనుక కారణం
తొక్కిసలాట వెనుకకు గల కారణాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. కానీ ప్రాథమిక నివేదికల ప్రకారం ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన భక్తులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు బాగున్నా తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారంటే అధికారుల నిర్లక్ష్యమే కారణమని వాదన తెరపైకి వచ్చింది.






















