US News: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురు భారతీయుల దుర్మరణం- మృతుల్లో ముగ్గురు తెలుగువారే
America News: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. ఇందులో ముగ్గురు తెలుగువారున్నారు. ప్రమాదం టైంలో కారు దగ్దమై మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.
US Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరనించినవారిలో ముగ్గురు తెలుగువారు కాగా ఒకరు తమిళనాడు యువతి ఉన్నారు. ఇద్దరు తెలుగువారిలో ఇద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాయి. డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతుల కుటుంబాలకు మృతదేహాలను అందజేస్తామని వైద్యులు అంటున్నారు. అమెరికాలో లాంగ్ వీకెండ్ కావడంతో టెస్టుల నిర్వహణకు ఆలస్యం కావొచ్చని భావిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కలగజేసుకుని చర్యలు వేగవంతం అయ్యేలా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వేగంగా వచ్చి ఢీకొట్టిన ట్రక్కు..
టెక్సాస్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. కొల్లిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు వైట్ స్ట్రీట్ దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మృతులను హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి, అతని స్నేహితుడు ఫరూక్ షేక్, తెలుగువాడైన లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌గా గుర్తించారు.
మృతులు నలుగురు బెంటన్‌విల్లేకు వెళ్లేందుకు కార్ పూలింగ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకున్నారు. బెంటన్‌విల్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి డల్లాస్‌లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. లోకేశ్ పాలచర్ల తన భార్య వద్దకు బెంటన్‌విల్లేకు వెళ్తున్నారు. ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన దర్శిని వాసుదేవన్, బెంటన్‌విల్లేలోని తన మామను చూడటానికి వెళుతున్నారు. అతి వేగంగా వస్తున్న ఓ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న ఎస్వీయూని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వీరు ప్రయానిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగినప్పుడు కారుకు మంటలంటుకోవడంతో గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో వైద్యులు మృతదేహాలను మార్చురీకి తరలించి డీఎన్ఏ టెస్టులు నిర్వహించి బంధువులకు అందజేయనున్నారు. అయితే లాంగ్ వీకెండ్ కావడంతో మృతదేహాల తరలింపు ప్రక్రియ అలస్యమయ్యేలా ఉందని తెలుస్తోంది.
చదువులు పూర్తై స్థిరపడుతున్న సమయంలో..
ప్రమాదంలో మరణించినవారంతా చదువులు పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం వారి కుటుంబాల్లో మరింత తీవ్ర విషాదం నింపింది. ఆర్యన్ తండ్రి సుభాష్ చంద్రారెడ్డికి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మ్యాక్స్ అగ్రి జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. రాయచోటికి చెందిన ఈ కుటుంబం హైదరాబాద్‌లోని నిజాంపేటలో స్థిరపడింది. ఆర్యన్ కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీఠంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. "టెక్సాస్ డల్లాస్ విశ్వవిద్యాలయంలో అతని కాన్వకేషన్ కోసం తల్లిదండ్రులు మే 2024లో U.S.లో ఉన్నారు. కాన్వకేషన్ తర్వాత ఆర్యన్‌ని భారతదేశానికి తిరిగి రమ్మని అడిగారు. అయితే అతను తన తల్లిదండ్రులకు తాను మరో రెండేళ్లు యునైటెడ్ స్టేట్స్‌లో పని చేసి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పాడు.ఇంతలోనే విధి తమ కుమారుడ్ని దూరం చేసిందని సుభాష్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఫరూక్ హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు చెందినవాడు. ఫరూక్ షేక్ తండ్రి మస్తాన్ వలి. మసాన్ వలి రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగి. వారి కుటుంబం హైదరాబాద్‌లో BHEL లో నివసిస్తుంది. గుంటూరుకు చెందిన మస్తాన్‌వలి చాలా కాలంగా హైదరాబాద్‌లోనే నివాసం నివాసం ఉంటున్నారు. కాగా కుమారుడు ఫరూక్ వాసవీ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా ఫరూక్ ఎంఎస్ చదువుల కోసం అమెరికాలో ఉంటున్నాడు. ఇటీవలే ఎంఎస్ కూడా పూర్తయింది. ఫరూక్ సోదరి కూడా యునైటెడ్ స్టేట్స్‌లో ఉంటోంది. అక్కడి పరిస్థితులను ఆమే పర్యవేక్షిస్తుంది. దర్శిని టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల ముందు వరకు కూడా దర్శిని తల్లి ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. పోన్ పెట్టేసిన కొద్ది క్షణాలకే జరిగిన దుర్ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మృతదేహాల గుర్తింపు కోసం DNA టెస్టులు
మృతదేహాలను గుర్తించడానికి అధికారులు DNA టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో కారు దగ్ధం కావడంతో మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో వేలిముద్రలు, దంతాలు, ఎముకల అవశేషాలను పరీక్షిస్తున్నారు. తల్లిదండ్రుల నమూనాలతో పోల్చి చూడటానికి కూడా ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతోపాటు అమెరికాలో లాంగ్ వీకెండ్ కావడంతో మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో జాప్యం జరిగేలా ఉందని తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కలగజేసుకుని తమవారి మృతదేహాలను త్వరగా స్వదేశానికి వచ్చేలా చూడాలని మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు.