(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: తాను పురుగుల మందు తాగి.. ఆరేళ్ల కుమార్తెకు ఉరేసిన తండ్రి..
నెల్లూరు జిల్లాలో ఈ రెండు రోజుల వ్యవధిలో వేర్వేరు నేర ఘటనలు జరిగాయి. భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా ఓ భర్త వీడియో తీయగా.. మరో దగ్గర కుమార్తెకు ఉరేసి చంపబోయాడు ఓ తండ్రి.
నెల్లూరు జిల్లాలో కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ఆరేళ్ల పాప మరణం అంచుకు వెళ్లి బతికి బయటపడింది. దొరవారిసత్రం మండలం, మోదుగుల పాళెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మేర్లపాక మురళి అనే వ్యక్తి భార్యమీద కోపంతో పురుగుల మందు తాగాడు, అతనితోపాటు అతని తల్లి మస్తానమ్మ కూడా పురుగుల మందు తాగింది. ఆ తర్వాత ఆరేళ్ల కుమార్తె కావ్యకు ఉరేసి చంపాలని చూశాడు మురళి. ఈ క్రమంలో స్థానికులు అప్రమత్తపై కావ్యను ఉరి నుంచి తొలగించారు. దీంతో ఆ పాప బతికింది. పురుగుల మందు తాగిన మురళి, అతని తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే వారు చనిపోయారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణం..
కుటుంబ కలహాల వల్లే ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల మురళి భార్య ఇంటినుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మురళి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మురళి తల్లి కూడా అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరూ పురుగుల మందు తాగి చనిపోగా.. మురళి కుమార్తె కావ్య మాత్రం చుట్టుపక్కలవారు కాపాడటంతో ప్రాణాలతో మిగిలింది. మురళి కుమారుడు లోకేష్ ఆచూకీ లభించడంలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శాడిస్ట్ భర్త అరెస్టు
భార్యపై అనుమానంతో తరుచు వేధిస్తూ ఆమె ఉరి వేసుకుని చనిపోయే లా ప్రేరేపించి చనిపోతున్న దృశ్యాన్ని వీడియో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందిన మొగుడు పెంచలయ్య పై కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు. భార్య చనిపోతుంటే భర్త వీడియో తీసి పైశాచికానందం పొందిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. భర్తను అరెస్ట్ చేశారు. ఆత్మకూరు డీఎస్పీ కె.వెంకటేశ్వర రావు జరిగిన సంఘటన గురించి మీడియాకు వివరించారు.
భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడవలసిన భర్త ఆమె ఉరి వేసుకున్న దృశ్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఆమె చనిపోయిన తర్వాత ఆ వీడియోను వారి కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందిన భర్త పెంచలయ్యను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. కారణం ఏదైనా కళ్లేదుటే తన భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉండగా నిలుపుదల చేయవలసిన భర్త ఇటువంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ గారు ఆదేశాలతో స్థానిక సీఐ, ఎస్సైలు కలిసి దర్యాప్తు చేపట్టి భర్త పెంచలయ్యను వెంటనే అదుపులోకి తీసుకున్నందుకు అభినందిస్తున్నానని డీఎస్పీ తెలిపారు.