బెజవాడలో బరితెగించిన తండ్రి- కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం
కూతురు పట్ల కన్న తండ్రే బరితెగించాడు. మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ ఉన్నాడు. చివరకు ఆ బాధ భరించలేక అసలు విషయం తల్లికి చెప్పింది కుమార్తె. దీంతో దిశ పోలీసులను తల్లి ఆశ్రయించింది.
బెజవాడలో కన్నతండ్రి పశువులా మారాడు. వరుసగా మూడు సంవత్సరాలుగా కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కన్నతల్లి నిర్ఘాంతపోయింది. తండ్రి తన పట్ల వ్యవహరించిన తీరును కన్నతల్లికి చెప్పుకొని రోదించింది కూతురు . కుటుంబానికి అండగా నిలబడాల్సి తండ్రి అభంశుభం తెలియని కన్నకూతురిపైనే అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించాడు.
మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి రావటంతో అంతా నివ్వెరపోయారు. ఈ దారుణమైన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. మాచవరం ప్రాంతానికి చెందిన ఓ కారు డ్రైవరుగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ట్రావెల్ ఏజెన్సీ కూడా నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గతంలో భర్త ఫోన్‌లో 13సంవత్సరాల వయస్సు ఉన్న పెద్ద కుమార్తె నగ్నచిత్రాలు చూసిన తల్లి కంగుతింది. దీంతో ఈ వ్యవహరంపై భర్తను నిలదీసింది. అవన్నీ మార్ఫింగ్ ఫోటోలను బయటకు వస్తే మన పరువే పోతుందంటూ భర్త నమ్మించాడు. ఆ తరువాత వాటిని తొలగించడంతో భార్య మిన్నకుండిపోయింది.
మారని భర్త ప్రవర్తన....
అయితే ఆ తరువాత నుంచి భర్త ప్రవర్తనలో భార్యకు అనుమానం వచ్చింది. ఇంటిలో సరిగా ఉండకపోవటంతో,భర్త నడవడిక పై భార్య ఆరా తీస్తూనే ఉంది. ముందు జాగ్రత్తగా తన ఇద్దరు కుమార్తెలను 2022 జులైలో గన్నవరంలోని ప్రైవేట్ హాస్టల్‌లో చేర్పించింది. అక్కడే ఉంచి చదివిస్తోంది. ఈ నెల 7వ తేదీన కుమార్తెలిద్దరూ ఇంటికి వచ్చారు. పెద్ద కుమార్తె తనకు దూరంగా ఉందన్న కోపంతో తండ్రి ఆమెను బెల్టుతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకున్న భార్యను కూడ దుర్భాషలాడి,తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత పిల్లలిద్దరూ తిరిగి హాస్టల్‌కు వెళ్లిపోయారు. ఇటీవల సంక్రాంతి పండుగ కావటతం పిల్లలను ఇంటికి తీసుకువచ్చింది తల్లి .
తండ్రి కాదు..రాక్షసుడు...
ఇదే అదునుగా భావించిన తండ్రి, పెద్ద కుమార్తెను బ్యాంకు పని ఉందంటూ ద్విచక్రవాహనంపై తీసుకువెళ్ళాడు. సాయంత్రం చీకటి పడిన తరువాత తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రి 11 గంటల తరువాత సమయంలో పెద్ద కుమార్తె తల్లి దగ్గరకు వెళ్లి హత్తుకొని ఏడ్చేసింది. తండ్రి తనపట్ల వ్యవహరించిన దారుణమైన ఘటన గురించి వివరించింది. విజయవాడ శివారు ప్రాంతం రామవరప్పాడు ఫ్లై ఓవర్ వద్దకు తీసుకు వెళ్ళి, నిర్మానుష్య ప్రాంతంలో తనను గాయపరచి మరి తండ్రి తనపై పడి చేసిన పనులను కూతరు తల్లికి చెప్పింది.
తండ్రి ప్రవర్తన అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికి,తనను తీవ్రంగా గాయపరిచాడని,అరిస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించి తండ్రి కర్కశంగా వ్యవహరించాడని కుమార్తె చెప్పటంతో తల్లి కుప్పకూలిపోయింది. తన మీద తండ్రి మూడేళ్లుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడని, కుమార్తె చెప్పటంతో తల్లి మరింత కుంగిపోయింది. చివరకు తేరుకొని న్యాయం చేయాలని దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.