Kurnool Bus Accident: బైక్ నడిపిన శివశంకర్‌పై ఫ్రెండ్ ఎర్రిస్వామి ఫిర్యాదు, ప్రమాదంపై వీడిన మిస్టరీ
Kurnool Travel Bus Accident: కర్నూలులో ట్రావెల్స్ బస్సు దగ్దమై ప్రయాణికులు చనిపోయిన ఘటనలో బైక్ నడిపిన శివశంకర్‌పై ఫ్రెండ్ ఎర్రిస్వామి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Kurnool Bus Fire Accident: కర్నూలు: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదానికి గురైన ప్రమాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు కాలిపోయి ప్రయాణికులు చనిపోయిన ఘటనలో బైకర్ శివశంకర్‌పై అతని ఫ్రెండ్ ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ డ్రైవింగ్ చేయడం వల్లే డివైడర్‌ను ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పెట్రోల్ కొట్టించుకున్నాక బంక్ నుంచి బయలుదేరారు. తరువాత శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో డివైడర్‌ను ఢీకొట్టగా, ఇద్దరం పల్సర్ మీద నుంచి కింద పడిపోయినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి తెలిపాడు. డివైడర్ ను తల బలంగా తాకి రోడ్డు మీద పడటంతో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైకుకు మరో పక్కన పడిపోయిన తాను శివశంకర్ మృతదేహాన్ని పక్కకు జరిగేందుకు ప్రయత్నిస్తుండగా వెనకాల వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో బైక రోడ్డు మధ్యలోకి వెళ్లింది. తరువాత అదే మార్గంలో వెళ్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్ట కొంతదూరం లాక్కెళ్లినట్లు ఎర్రిస్వామి తన ఫిర్యాదులో తెలిపాడు.

కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో మొదట పల్సర్ బైక్ వచ్చి వి కావేరి ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిందని అంతా భావించారు. మరోవైపు వి కావేరి ట్రావెల్స్ బస్సు, పల్సర్ బైకును ఢీకొట్టి ఉండొచ్చు అని ప్రచారం జరిగింది. ఆ తరువాత మద్యం మత్తులో బైక్ నడపటం వల్లే ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. అయితే ప్రమాదంపై మిస్టరీ వీడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పల్సర్ బైక్‌పై తన స్నేహితుడు ఎర్రిస్వామిని తుగ్గలి గ్రామంలో వదిలేందుకు లక్ష్మీపురం నుండి శివశంకర్ బయలుదేరాడు. కియా షోరూమ్ వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ నింపుకున్నారు.
కొద్ది దూరం వెళ్లిన తరువాత పల్సర్ బైక్ స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టింది. రోడ్డు మీద పడి బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చొన్న వెర్రిస్వామి రోడ్డుకు దూరంగా పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మధ్యలో ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగుతున్న సమయంలో పల్సర్ బైక్‌ను మరో వాహనం ఢీ కొట్టడంతో రోడ్డు మధ్యలోకి వెళ్లింది. ఆ తరువాత వీ కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైకును కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్ళింది. బస్సు కింద మంటలు వచ్చినట్లు గుర్తించిన ఎర్రిస్వామి భయపడి తన గ్రామం తుగ్గలికి వెళ్ళిపోయినట్లు ఫిర్యాదులో తెలిపాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎర్రిస్వామిని గుర్తించిన పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఎర్రిస్వామి చెప్పిన విషయాలు సరిపోలినట్లు గుర్తించారు.























