Heera Gold case: ఈడీని బెదిరించేందుకు మనుషుల్ని పెట్టిన వేల కోట్ల స్కామ్ చేసిన నౌహిరా షేక్ - కానీ కథ అడ్డం తిరిగింది!
ED investigation: వేల కోట్ల మేర అమాయకుల్ని మోసం చేసిన నౌహిరా షేక్ .. ఈడీ అధికారుల్ని బెదిరించేందుకు ఓ వ్యక్తిని నియమించుకున్నారు. అతన్ని ఈడీ పట్టుకుని జైలుకు పంపింది.

ED investigation in Heera Gold case: కోట్లాది రూపాయల హీరా గోల్డ్ కుంభకోణం కేసులో నిందితురాలు నౌహెరా షేక్ తరపున రంగంలోకి దిగి, ఈడీ అధికారులను బెదిరించిన కళ్యాణ్ బెనర్జీ అనే వ్యక్తిని హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు అరెస్ట్ చేశారు. జనవరి 10, 2026న పిఎంఎల్‌ఏ, 2002 చట్టం కింద ఇతడిని అదుపులోకి తీసుకున్న ఈడీ, ఆదివారం నాడు నాంపల్లిలోని ప్రత్యేక పిఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచింది. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జనవరి 23వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తు సంస్థ పనితీరులో జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడమే ఇతడి అరెస్టుకు ప్రధాన కారణమని ఈడీ స్పష్టం చేసింది.
వేల కోట్లు మోసం చేసిన నౌహిరా షేక్
నౌహెరా షేక్ , ఇతరులు అధిక లాభాల ఆశచూపి వేలాది మంది అమాయక పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 5,978 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. ఈ నిధులతో ఆమె తన పేరిట, బంధువుల పేరిట భారీగా ఆస్తులను కొనుగోలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రూ. 428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బాధితులకు న్యాయం చేసేందుకు జప్తు చేసిన ఆస్తులను వేలం వేయాలని ఈడీ సుప్రీంకోర్టును కోరగా, కోర్టు అనుమతితో జనవరి 5, 2026న వేలం ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఈ వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు నౌహెరా షేక్ పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించినా, కోర్టులు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చడమే కాకుండా రూ. 5 కోట్ల భారీ జరిమానా కూడా విధించాయి.
ఈడీని బెదిరించేందుకు కల్యాణ్ బెనర్జీ అనే వ్యక్తి ప్రయత్నం
చట్టపరమైన పోరాటంలో విఫలమైన నౌహెరా షేక్, వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు కళ్యాణ్ బెనర్జీ అనే వ్యక్తిని నెలవారీ జీతం , కమిషన్ ప్రాతిపదికన నియమించుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. నిందితుడు కళ్యాణ్ బెనర్జీ తనకు ఉన్నతాధికారులు , రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఈడీ అధికారులకు ఫోన్లు, వాట్సాప్ సందేశాల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చాడు. వేలం ప్రక్రియను ఆపకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను నేరుగా బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడి సికిందరాబాద్ నివాసంలో జరిపిన సోదాల్లో నౌహెరా షేక్ , ఆమె అనుచరులతో జరిపిన అక్రమ లావాదేవీల సమాచారం, వాట్సాప్ చాట్లు ఈడీ స్వాధీనం చేసుకుంది.
ED, Hyderabad Zonal Office, has arrested Kalyan Banerjee, an imposter who was trying to interfere in the working of the ED, on 10.01.2026 in connection with an ongoing investigation under the PMLA, 2002 in a case against Mrs. Nowhera Shaik & others in a matter related to… pic.twitter.com/NNQZHy0jyR
— ED (@dir_ed) January 12, 2026
నేరాన్ని అంగీకరించిన కల్యాణ్ బెనర్జీ
విచారణలో కళ్యాణ్ బెనర్జీ తాను కేవలం నౌహెరా షేక్ సూచనల మేరకే ఈ బెదిరింపులకు పాల్పడ్డానని, అధికారులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించానని అంగీకరించాడు. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు, అక్రమ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు నిందితులు వేస్తున్న ఎత్తుగడలను ఈడీ తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ అధికారులను విధులకు ఆటంకం కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా కఠినంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఈడీ హెచ్చరించింది. ఈ అరెస్టుతో హీరా గోల్డ్ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.





















