NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్
Cyber Crimes: చిన్నారులపై సైబర్ నేరాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిందని చైల్డ్ రైట్స్ అండ్ యూ రిపోర్ట్ వెల్లడించింది.
Cyber Crimes Against Children:
చిన్నారులపై సైబర్ నేరాలు..
సైబర్ నేరాల (Cyber Crimes) ముప్పు నుంచి తప్పించుకోవడం ప్రభుత్వాల వల్ల కావడం లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చి కంట్రోల్ చేస్తున్నా మళ్లీ ఏదో ఓ కొత్త దారిలో సైబర్ నేరస్థులు వల వేస్తూనే ఉన్నారు. ఈ వలలో పెద్ద వాళ్ల కన్నా చిన్నారులే ఎక్కువగా చిక్కుతున్నారు. మరీ ఆందోళనకర విషయం ఏంటంటే...పోర్నోగ్రఫీకి బాధితులవుతున్నారు చాలా మంది. ఆన్‌లైన్ వేధింపులకు బలి అవుతున్నారు. ఏటా ఈ సైబర్ నేరాలకు సంబంధించిన లెక్కలు విడుదల చేసే Child Rights and You (CRY) సంస్థ గతేడాది గణాంకాలను విడుదల చేసింది. ఏడాది కాలంలో చిన్నారులపై సైబర్ నేరాలు 32% మేర పెరిగాయని వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం..2022లో సైబర్ నేరాల బారిన పడిన చిన్నారుల సంఖ్య 1,823గా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం..అంటే 2021లో బాధితుల సంఖ్య 1,376గా ఉంది. ఏడాదిలోనే ఈ సంఖ్య బాగా పెరిగింది. పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడటం సవాలుగా మారింది. చిన్నారులకు సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం అతి పెద్ద సమస్యగా మారిందని CRY సీఈవో పూజా మర్వాహా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడే మరో కీలక విషయం వెల్లడించారు. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా మంది చిన్నారులు మొబైల్స్‌కి అలవాటు పడిపోయారు. మొబైల్స్‌తో పాటు మరి కొన్ని గ్యాడ్జెట్‌లూ వాళ్లకు అలవాటయ్యాయి. ఆ సమయంలోనే ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. ఆ వ్యసనమే వాళ్లను తప్పుదోవ పట్టిస్తోంది. అలా అని వాళ్ల నుంచి టెక్నాలజీని వేరు చేయలేమని, కేవలం సైబర్ నేరాలపై నిఘా మరింత పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు పూజా.
మహారాష్ట్రలో అత్యధికం..
2021లో చిన్నారులపై నమోదైన సైబర్ నేరాల సంఖ్య లక్షా 49 వేలకుపైగా ఉంది. అదే 2022 సంవత్సరంలో లక్షా 62 వేల 449కి పెరిగింది. CRY రిపోర్ట్ ఈ విషయం వెల్లడించింది. గతేడాది రోజూ దేశంలో చిన్నారులపై 445కి పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. అంటే...సగటున గంటకు 18 కంటే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ప్రతి లక్ష మంది చిన్నారులపై నేరాల రేటు 2021లో 33.6%గా ఉండగా...2022లో అది 36.6%కి పెంచింది. 2013-22 మధ్య కాలంలో భారత్‌లో చిన్నారులపై సైబర్ నేరాలు 179% మేర పెరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. అయితే..ఇటీవల కాలంలో సైబర్ నేరాలపై అవగాహన పెరగడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని పూజా మర్వాహా వెల్లడించారు. కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక లైంగిక నేరాలూ పెరుగుతున్నాయి. ఈ నేరాల్లో 98.92% మంది బాధితులు బాలికలే ఉంటున్నారు. 96.8% కేసుల్లో తెలిసిన వాళ్లే బాలికలపై ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. చిన్నారులపై జరుగుతున్న నేరాల విషయంలో మహారాష్ట్ర 12.8%తో అగ్రస్థానంలో ఉంది. ఆ తరవాత మధ్యప్రదేశ్‌లో 12.6%, యూపీలో 11.5%,రాజస్థాన్‌లో 5.8%,పశ్చిమ బెంగాల్‌లో 5.5%నేరాలు నమోదవుతున్నాయి. మొత్తం నేరాల్లో దాదాపు సగం వరకూ ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ సంఖ్యని తగ్గించాలంటే వ్యవస్థాగతంగా ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
Also Read: Websites Blocked: పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట భారీ మోసం, 100 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం