Cheating: మొన్న నకిలీ బంగారం బిల్లలు, నిన్న మట్టి పెల్ల, ఏం జరిగిందంటే?
Cheating: రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు మాయ మాటలు చెప్పి ముంచేవాళ్లు కొందరు అయితే, ఆన్ లైన్ మోసాలకు పాల్పడే వాళ్లు మరికొందరు. ఇలాంటివే రెండు ఘటనలు జరిగాయి.
Online Fraud: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు సంఘటనలు జనాల అత్యాశని మోసగాళ్లు ఏ రకంగా వాడుకుంటున్నారో తెలియజేస్తున్నాయి. అటు పోలీసులు, ఇటు సైబర్ నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ.. కొందరు ప్రజలు మాత్రం మారడం లేదు. తక్కువ ధరకు వస్తుందంటే ఎదుటివాడి మొహం చూడకుండానే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీంతో నేరస్థులకి తమ పని తేలికవుతోంది.
తక్కువ ధర అంటూ మోసాలు..
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్ ఇస్తామని చెప్పి కరీంనగర్ జిల్లా వాసులను తేలికగా మోసం చేశారు కర్ణాటక మోసగాళ్లు. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో అతి తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లకి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. ఇల్లంతకుంట మండలం నరసక్కపేట గ్రామానికి చెందిన ఓ చిరు వ్యాపారితో పాటు మరి కొందరికి.. కర్ణాటకలో తక్కువ ధరకే బంగారం వస్తుందంటూ మోసగాళ్లు నమ్మించారు. మీరు డబ్బులు తీసుకొని అక్కడకు వస్తే చాలు.. తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయొచ్చని వివరించారు. దీంతో వారంతా ఆ విషయాన్ని నమ్మి మొత్తం 15 లక్షల చేతపట్టుకొని వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వద్ద గోల్డ్ కాయిన్స్ ని కొనుగోలు చేశారు. వెంట తీసుకొని వచ్చి... సరిసిల్లలోని స్వర్ణకారులకు చూపించారు.
కాయిన్స్ ను పరీక్షించే టైం కూడా ఇవ్వలేదు..
అవన్నీ నకిలీవని తెలియడంతో లబోదిబోమన్నారు. వెంటనే పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు బాధితులు. వారికి పూర్తి విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే బంగారం వ్యాపారం చేసే వ్యక్తినే నకిలీ బంగారంతో మోసం చేయడం ఏంటా అని ప్రజలంతా ముక్కున వేలేస్కుంటున్నారు. డబ్బులు చెల్లించిన సమయంలో సదరు బంగారు నాణాలను పరీక్షించే అవకాశం కూడా ఇవ్వలేదని దీంతో తాము మోసపోయామని పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితులని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి పిలిపించి గతంలోనే విచారించారు. తొందరపడ్డ వ్యాపారికి మోసగాళ్లు మళ్లీ కాంటాక్ట్ లో లేకుండా పోవడంతో డబ్బుల విషయంలో సదరు వ్యాపారి సైతం ఎలాంటి ఆశలు పెట్టుకోనట్టు తెలుస్తోంది.
రెగ్యూలర్ గా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు
ఎవరైనా ఆన్ లైన్ లో ఫోన్ తక్కువ ధరకు వస్తుందంటే కొనే ముందు పది రకాలుగా ఆలోచిస్తారు. కానీ సైదాపూర్ మండలం జాగిర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు అత్యాశకుపోయి ఆన్ లైన్ లో 12 వేల రూపాయల ఫోన్ 1500 రూపాయలకే వస్తుందంటూ ఒక ప్రకటన చూశాడు. మరోవైపు దీనికి సంబంధించి కేటుగాళ్లు పోస్టులో ఆర్డర్ వస్తుందంటూ అక్కడ 1500 చెల్లించి తీసుకోవాలని ఫోన్ ద్వారా సూచించారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పార్సిల్ తీసుకోవాలనుకున్న ఆ యువకుడు అక్కడ 1500 కట్టాడు. అప్పటి వరకు బాగానే ఉంది. పార్సిల్ విప్పి చూడగా అందులో ఓ పవర్ బ్యాంకు ఆ పవర్ బ్యాంకులో మట్టి పెల్ల ఉంది. దీంతో సదరు నెంబర్ కి తిరిగి కాల్ చేసిన ఆ యువకుడికి మరో రెండు గంటల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామంటూ ఆన్సర్ వచ్చింది. రెండు గంటలైనా డబ్బులు చెల్లించకపోవడంతో తిరిగి కాల్ చేయగా అటువైపు నుండి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు కాస్త తెలివిగా ఆలోచించాలని పోలీసులు హెచ్చరించేది.