Chittoor Ganja Smuggling : చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తు, పోలీసుల కళ్లు గప్పి జోరుగా రవాణా!
Chittoor Ganja Smuggling : చిత్తూరు జిల్లాను గంజాయి మత్తు ఆవరిస్తుంది. సరిహద్దులు దాటి వస్తున్న స్మగ్లర్లు యువతను పక్కదారి పట్టి్స్తూ గంజాయి విక్రయిస్తున్నారు. ఇటీవల ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో వైరల్ అయింది.
Chittoor Ganja Smuggling : చిత్తూరు జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతుంది. సొంత జిల్లాలో గంజాయి మత్తుకు యువత బానిసలుగా మారుతున్నారు. ఎస్.ఆర్.పురం మండలం, పాలసముద్రం మండలం, గుడిపాల మండలంలో పోలీసుల కన్నుల కప్పి గంజాయి రవాణా సాగిస్తున్నారు కొందరు స్మగ్లర్స్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంమైన తొట్టికండ్రిక గ్రామానికి చెందిన కొందరు యువకులు యథేచ్చగా గంజాయి సేవిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
గ్రామాల్లో గంజాయి
చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. నిత్యం వేలాది మంది వ్యాపార నిమిత్తం రాకపోకలు రాగిస్తుంటారు. గంజాయి రవాణాకు చిత్తూరు జిల్లా నిలయంగా మారుతుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన పాలసముద్రం మండలం మొదలుకొని గుడిపాల, ఎస్.ఆర్.పురం మండలం, గంగాధర నెల్లూరు మండలం, పుంగనూరు మండలం, పలమనేరు, కుప్పం, పుత్తూరు, నగరి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండడంతో కొందరు రహస్య మార్గాల ద్వారా గంజాయి ఫ్యాకెట్లను జిల్లాకు తరలిస్తూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు డీలర్లను ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులు గంజాయి మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
(గంజాయి సేవిస్తూ వీడియో పోస్టు చేసిన యువకుడు అరెస్టు)
గంజాయి సేవిస్తున్న వీడియో వైరల్
ఇటీవల జిల్లాలో గంజాయి సేవిస్తున్న వీడియో వైరల్ అయింది. గంజాయి సేవిస్తున్న వీడియోలను యువకులు సోషన్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మరికొందరు యువకులు గంజాయి సేవించడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. గంజాయి సేవించిన కొందరు యువకులు విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారానికి ఒక్కసారి తమిళనాడు నుంచి కొందరు వాహానాల్లో వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు యువకులు గంజాయి సేవిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నప్పటికి పోలీసులు క్షేత్ర స్థాయిలో గట్టి నిఘా పెట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో నిఘా విఫలమా?
గంజాయి అక్రమ రవాణాపై క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాల్సిన పోలీసులు, అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గంజాయి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో గంజాయి నిషేధం కేవలం మాటలకే పరిమితం అవుతోంది. పాలసముద్రం మండలం తొట్టకండ్రిక సమీపంలోని సాయినగర్ లో ఉండే ఓ యువకుడు నిత్యం గంజాయి సేవించి స్థానికంగా ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కొన్ని గంటల సమయంలో విడిచిపెట్టేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు, ఉద్యోగులు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు.