Assam Girl: 'ఆంటీ అత్యాచారం అంటే ఏంటి?' - ఇలా అడిగిన రెండు రోజులకే ఆ బాలికపై దారుణం, మనసులను కలిచి వేసే కన్నీటి కథ
Crime News: అస్సాంలో పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి హృదయ విదారక అంశాలు వెలుగు చూశాయి. ఆమె డీఎస్పీ కావాలని కలలు కన్నట్లు బాలిక బంధువు మీడియాకు తెలిపారు.
Assam Victim Girl Sad Story: 'ఆంటీ రేప్ అంటే ఏంటి?'.. పశ్ఛిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివిన ఆ బాలిక ఆమె బంధువును ఇలా అడిగింది. అలా అడిగిన రెండు రోజులకే ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అస్సాంలో పదో తరగతి బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండ్రోజుల క్రితమే కోల్‌కతా అత్యాచార ఘటన గురించి పేపర్‌లో చదివిన బాలిక తన సమీప బంధువును అత్యాచారం అంటే ఏంటీ అని అడిగినట్లు తెలుస్తోంది. చివరకు ఆమెకు అలాంటి పరిస్థితే ఎదురు కావడం అందరినీ తీవ్ర వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని సదరు బాలిక బంధువే స్వయంగా వెల్లడించారు. కాగా, గువాహటిలో ఉండే బాలిక తండ్రికి ఆమెను చదివించే స్థోమత లేక తన బంధువు వద్దకు పంపారు.
'డీఎస్పీ కావాలని కలగంది'
'పశ్చిమబెంగాల్ ఘటన గురించి పేపర్‌లో చదివి ఆంటీ రేప్ అంటే ఏంటీ.? అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆమెను రక్షించడంలో నేను విఫలమయ్యానని అనిపించింది. తను డీఎస్పీ కావాలని కలలు గంది. ఆమెను కలిసేందుకు డీఎస్పీ ఆస్పత్రికి వస్తే అంతటి కష్టంలోనూ తన ముఖంపై చిరునవ్వునే ప్రదర్శించింది.' అని మీడియాకు బాధిత బాలిక బంధువు వెల్లడించారు. తన కుమార్తె తనతో కనీసం మాట్లాడలేకపోయిందని.. ఆ స్థితిలో ఆమెను చూసి తన హృదయం ముక్కలైందని బాలిక తండ్రి వాపోయారు.
ఇదీ జరిగింది
అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన ఓ బాలిక (14) ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. ఈ నెల 22న (గురువారం) రాత్రి దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెల్లి అత్యాచారం చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 'హేయమైన నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం' అని పేర్కొన్నారు.
ప్రధాన నిందితుడు మృతి
మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చెరువులో దూకాడు. వెంటనే స్పందించిన పోలీసులు రెస్కూ ఆపరేషన్ చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 2 గంటల అనంతరం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.