Food Poisoning: ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ - 26 మంది విద్యార్థులకు అస్వస్థత
Food Poisoning: అనంతపురం ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అవడంతో.. 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Food Poisoning: వారంతా హాస్టల్ లో ఉంటూ చదువుకునే విద్యార్థులు. అయితే రాత్రి గుడ్డు, టమాటా రైస్, పెరుగన్నం, తిని పడుకున్నారు. కానీ అర్ధరాత్రి చాలా మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. 26 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ కారణంగానే 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రోజు రాత్రి విద్యార్థులు గుడ్డుతో పాటు టమాటా రైస్, పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని... వారిని ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారిని హాస్టల్ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు.