Amritpal Singh Arrested: 37 రోజులు పది సిటీలు, అమృత్ పాల్ కోసం సినిమా లెవెల్‌లో ఛేజింగ్
Amritpal Singh Arrested: అమృత్ పాల్ సింగ్ 37 రోజుల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.
Amritpal Singh Arrested:
మార్చి 18న పరారీ
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 37 రోజులుగా అతడి కోసం గాలిస్తున్నారు పంజాబ్ పోలీసులు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే వీడియోలు విడుదల చేసి పోలీసులకు సవాలు విసిరాడు అమృత్ పాల్. అప్పటి నుంచి వరసుగా అతడి సన్నిహితులను అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లకు అమృత్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదేమంత సింపుల్‌గా అవలేదు. మార్చి 18న అమృత్‌పాల్‌ని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టారు పోలీసులు. వెంటనే అలెర్ట్ అయిన అమృత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. మార్చి 18 నుంచి వాహనాలు మార్చుతూ చాలా చోట్ల తిరిగాడు. మార్చి 28న హోషియార్‌పూర్ నుంచి పంజాబ్‌కు వచ్చాడు. అత్యంత సన్నిహితుడైన పపల్‌ప్రీత్ సింగ్‌తో కలికి పంజాబ్‌లో ఓ చోట మకాం మార్చాడు. పపల్ ప్రీత్‌ని ట్రాక్ చేసిన పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. అప్పటికే అతడికి పాకిస్థాన్‌కు చెందిన ISIతో లింక్స్ ఉన్నాయని గుర్తించారు. దీంతో నిఘా మరింత పెంచిన పోలీసులు పపల్ ప్రీత్‌ని అరెస్ట్ చేశారు. అప్పుడే ఈ కేసు మలుపు తిరిగింది. అప్పటి వరకూ అమృత్ పాల్ చాలా చోట్ల సీసీ కెమెరాల్లో కనిపించాడు. రకరకాల వేషాలు వేసి తిరిగాడు. ఓ చోట సూటు బూటు వేసుకుని కనిపించాడు. మరో చోట పూర్తిగా మాస్క్ పెట్టుకుని తిరిగాడు. పటియాలా, కురుక్షేత్ర, ఢిల్లీ..ఇలా చాలా చోట్లకు మకాం మార్చాడు. నేపాల్‌కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.
10 సిటీల్లో చక్కర్లు
అయితే ఈ లోపే అమృత్ పాల్ రెండు వీడియోలు విడుదల చేశాడు. తాను పారిపోలేదని, త్వరలోనే అందరి ముందుకూ వస్తానని చెప్పాడు. అంతే కాదు. తనను అరెస్ట్ చేయాలనుకుంటే నేరుగా ఇంటికే రావచ్చుగా అని సవాల్ విసిరాడు. ఏప్రిల్ 14వ తేదీన వైశాఖి వేడుకల సందర్భంగా అమృత్ పాల్ అమృత్‌సర్‌కి వచ్చి లొంగిపోతాడన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. అప్పటికే సిక్కుల కీలక సంస్థ అయిన అకల్ తక్త్ అమృత్ పాల్ పారిపోవడంపై స్పందించింది. వెంటనే పోలీసులకు లొంగిపోవడం మంచిదని సూచించింది. పోలీసులు అరెస్ట్ చేసేలోగా దాదాపు 10 సిటీల్లో మారు వేషాల్లో తిరిగాడు అమృత్ పాల్. 9 మంది సన్నిహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఈ ఛేజ్ ముగిసింది.
మోగాలో అరెస్ట్..
అమృతపాల్ సింగ్‌ను పోలీసులు మోగాలోని గురుద్వారా నుండి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో 36 రోజుల పోలీసుల అన్వేషణకు తెరపడింది. అజ్నాలా ఘటన తర్వాత అతడు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న అతని భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను మూడు రోజుల క్రితం గురువారం (ఏప్రిల్ 21) అమృత్‌సర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అమృత్ పాల్‌కు సంబంధించిన అనుచరులు, సహచరులు అందరినీ ఇప్పటికే అరెస్టు చేశారు. అతని సహచరులను లోతుగా విచారణ చేశారు. అతని భార్యపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో అతడి ఆచూకీ తెలిసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: CBI Notices To Satya Pal Malik: కేంద్రంపై విమర్శలు, అంతలోనే సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు