(Source: ECI | ABP NEWS)
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Elephants attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించడంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం వద్ద రైతుపై దాడి చేసి తొక్కి చంపేశాయి.

Man dies in Elephants attack | చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఓ రైతును ఏనుగులు తొక్కి చంపడంతో విషాదం నెలకొంది. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ని ఏనుగులు తొక్కి చంపడం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆ ముగ్గురు భక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించింది.
చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం చేశాయి. కొత్తపల్లి సమీపంలో పొలం వద్ద పనిచేసుకుంటున్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు తెలిపారు. శరీరంలోని భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి నెలకొందని తోటి రైతులు చెబుతున్నారు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్య(65)గా గుర్తించారు. వరుస ఘటనలతో రాత్రివేళతో పాటు పగలు సైతం ఆ ప్రాంతాల్లో తిరగాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఫిబ్రవరిలో అన్నమయ్య జిల్లాలో విషాదం..
అన్నమయ్య జిల్లాలో ఫిబ్రవరి 24న విషాదం చోటుచేసుకుంది. ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో ముగ్గురు భక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండలం గుండాల కోన అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 14 మంది గుండాలకోనకు అటవీ మార్గంలో కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రిని పురస్కరించుకుని వై కోటకు చెందిన భక్తులు షార్ట్ కట్ అని శేషాచలం అడవులలో గుండా తలకోనకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏనుగుల గుంపు భక్తుల మీదకు దూసుకొచ్చి దాడి చేశాయి. గట్టిగా కేకలు వేస్తూ భక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు.
ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు తుపాకుల మణెమ్మ, చంగల్ రాయుడు, దినేష్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. మృతదేహాలను రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని తిరుపతి రుయాకు తరలించి చికిత్స చేయించారు. కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల దాడులు జరగకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది.






















