Kurnool Bus Fire Accident: ప్రైవేట్ ట్రావెల్స్ లో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది వరకు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Bus Fire Accident In Kurnool District | కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ బస్సు మంటలు చెలరేగి దగ్ధమైంది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 12 మంది గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. వి. కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్నూలు శివారు చిన్నటేకూరులో నేషనల్ హైవే 44పై ప్రమాదానికి గురైంది.
ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
అమరావతి: కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా స్పందించి సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అసలే తెల్లవారుజాము కావడంతో బస్సులోని వారు గాఢనిద్రలో ఉన్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. బస్సులోని సగం ప్రయాణికులు మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు. మంటలకు వెంటనే అప్రమత్తమైన కొందరు బస్సు దిగి కాలిన గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్లు పరారయ్యారని సమాచారం.
ఘటనా స్థలానికి హోం మంత్రి అనిత..
కర్నూలు : బస్సు ప్రమాద ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్పీ ప్రమాద స్థలికి బయల్దేరి వెళ్లారు. అగ్నిమాపక డీజీతో అనిత మాట్లాడారు. బస్సులో 44 మంది ఉన్నట్లు హోంమంత్రి అనితకు తెలిపారు. 18 మంది ప్రయాణికులు సురక్షితమన్నారు. 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోంమంత్రికి అధికారులు తెలిపారు. ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని హోంమంత్రికి అధికారులు తెలిపారు.






















