Tuni Crime News: తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య , కోమటి చెరువులో మృతదేహం లభ్యం
Tuni Crime News: తునిలో స్కూల్ విద్యార్థినిపై పాడుపనికి పాల్పడిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహంలో ఊరి శివారులోని కోమటి చెరువులో లభించింది.

Tuni Crime News: తునిలో బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు నారాయణ రావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కోర్టుకు తరలిస్తుండగా ఘటన జరిగింది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి నుంచి గాలిస్తున్న పోలీసులకు తుని శివారులోని కోమటి చెరువులు నారాయణరావు మృతదేహం లభించింది. పోలీసులు తీసుకెళ్తున్న టైంలో మూత్రవిసర్జన కోసం అని చెప్పి పక్కకు వెళ్లి ఒక్కసారిగా చెరువులో దూకాడు.
తునిలో వెలుగు చూసిన ఈ దారుణంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అమాయకమైన బాలికకు మాయమాటలు చెప్పి పాడు పనికి యత్నించాడని అంతా మండిపడుతున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే పెను సంచలనంగా మారింది. ఓ తోటలో ఈ వ్యక్తిని పట్టుకున్న వ్యక్తితో తాను టీడీపీకి చెందిన వ్యక్తినంటూ దబాయించేప్రయత్నం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అనిత, లోకేష్ అంతా స్పందించారు. ఇలాంటి ఘటనల్లో నిందితులను ఉపేక్షించేదే లేదని పేర్కొన్నారు. పోలీసులు వచ్చే లోపు నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. మరోవైపు మహిళా హక్కుల కమిషన్ కూడా పోలీసుల నుంచి వివరణ కోరింది.
అక్టోబ్ 21న ఉదయం సుమారు 11 గంటలకు తాటిక నారాయణరావు బాలికకు తను తాతయ్యను అవుతానంటూ పాఠశాల సిబ్బందిని పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే నెపంతో హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వెళ్లి తినుబండారాలు కొనిపెట్టి తనంటే ఇష్టం కలిగించేలా ప్రవర్తించాడు. ఆ విధంగా హాస్టల్ నుంచి అనేకమార్లు బయటకు తీసుకుని వెళ్లినట్లు, దానిలో భాగంగా మంగళవారం తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన నారాయణరావు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు తొండంగి మండలం, పైడికొండ గ్రామ శివారులో గల సపోటా తోటలోకి తీసుకొని వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయగా అటుగా వెళుతున్న వ్యక్తి చూశాడు. నారాయణరావుని ప్రశ్నించాడు. తాను టీడీపీకి చెందిన వ్యక్తిని అని తప్పుడు సమాచారం ఇచ్చాడు. వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తోటకు సమీపంలో ఉన్న రెడ్ స్కూటీపై బాలికను ఎక్కించుకొని పారిపోయిన నారాయణరావు ఆమెను స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఊరి జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం దృష్టికి రావడంతో కేసు నమోదుకు ఆదేశించింంది. వెంటనే తుని పోలీసులు నారాయణరావుపై Cr. No. 250/2025: u/s 137, 65(1) BNS, 2023, POCSO యాక్ట్ సెక్షన్స్ 6 r/w 5(l) ప్రకారం కేసుగా నమోదు చేశారు. సాక్షులను విచారించారు. నేర స్థల పరిశీలించారు. సాక్ష్యాల సేకరించారు. బాలికకు వైద్య పరీక్షలు జరిపారు. నేరం జరిగిందని నిర్దారించుకొని బుధవారం ఐదు గంటలకు జగన్నాధగిరి సమీపంలో రైల్వే అండర్ పాస్ వద్ద నారాయణరావును అరెస్టు చేశారు.
ప్రాథమిక విచారణ అనంతరం నారాయణరావును కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్ళారు. మార్గమధ్యలో తనక మూత్రం వస్తుందని పోలీసులకు చెప్పాడు. ఆ క్రమంలోనే సమీపంలో ఉన్న చెరవులో దూకాడు. పోలీసులు పట్టుకునేలోపు అంతా జరిగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో అవమాన భారం తట్టుకోలేక ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.





















