RBI MPC Meet: మీ లోన్ EMI తగ్గుతుందా, పెరుగుతుందా? కాసేపట్లో తేలిపోతుంది
రెపో రేట్ తగ్గితే బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. తదనుగుణంగా, EMI మొత్తం కూడా తగ్గుతుంది.
RBI MPC Meet February 2024: సామాన్యుడి ఇంటి బడ్జెట్‌పై భారం పడుతుందా, ఉపశమనం లభిస్తుందా, జనం కట్టాల్సిన లోన్ EMI మొత్తం పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది కాసేపట్లో తేలిపోతుంది. ఈ నెల 6న ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం, ఈ రోజు ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు, మోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత జరుగుతున్న మొదటి MPC భేటీ ఇది. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత లైవ్‌లోకి రానున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), MPC సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తారు.
MPC వరుసగా ఆరో సారి కూడా రెపో రేటు లేదా వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, రెపో రేట్ 6.5 శాతం వద్ద ఉంది. 2022 మే నుంచి ఇదే రేట్ కొనసాగుతోంది. గత ఐదు MPC భేటీల్లోనూ ఈ రేట్‌ను మార్పు చేయకుండా కొనసాగించారు. ఈసారి కూడా స్టేటస్ కో విధిస్తే, వరుసగా ఆరోసారి, 2024 ఫిబ్రవరి మీటింగ్‌లోనూ రెపో రేట్ 6.5 శాతం వద్దే ఉంటుంది.
"గత పాలసీ సమావేశం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో గట్టి మార్పులేమీ రాలేదు. ప్రపంచం ప్రశాంతంగా ఉంది, వడ్డీ రేట్లను మార్చేంత పెద్ద కారణాలేవీ లేవు కాబట్టి, రెపో రేట్‌ను RBI యథాతథంగా కొనసాగించవచ్చు" - ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన ఆర్థికవేత్త మాధవి అరోరా
ఆర్‌బీఐ రెపో రేట్‌కు దేశ ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా, ప్రజలు కట్టాల్సిన EMI మొత్తం పెరుగుతుంది. రెపో రేట్ తగ్గితే బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. తదనుగుణంగా, EMI మొత్తం కూడా తగ్గుతుంది. ఇదే కాకుండా.. దాదాపు దేశంలోని అన్ని రంగాల మీద రెపో రేట్ పెంపు/తగ్గింపు ప్రభావం ఉంటుంది.
రెపో రేట్‌తో పాటు, ఇతర కీలక రేట్లలో... స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్‌ను 6.25% వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేట్ & బ్యాంక్ రేట్‌ను కూడా మార్చకుండా 6.75% వద్దే ఆర్‌బీఐ ఉంచుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచాలా, తగ్గించాలా అన్న విషయంలో సెంట్రల్ బ్యాంక్ ఎలా స్పందిస్తుందనేది ఈ సమావేశంలో చూడాల్సిన కీలకమైన అంశాలలో ఒకటి.
బ్రోకరేజ్ సంస్థ నోమురా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జూన్ వరకు రెపో రేట్ మీద 'స్టేటస్ కో'ను కేంద్ర బ్యాంక్ కొనసాగించవచ్చు. ఆగస్టు నుంచి రేటు తగ్గింపులు ప్రారంభించవచ్చు.
రెపో రేట్‌ను నిర్ణయించే ఇతర అంశాలు
దేశంలో ఆర్థిక వృద్ధి, పన్ను వసూళ్లు, పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణం వంటివి కూడా రెపో రేట్ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో బలమైన GDP వృద్ధి, అధిక స్థాయిలో GST వసూళ్లు ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థలోని బలాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
అయితే, దేశంలో ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఆహార పదార్థాల్లో.. సామాన్య ప్రజలు నిత్యం కొనే కూరగాయలు, ఉప్పుపప్పులు, పాలు & అనుబంధ ఉత్పత్తులు ఇలా అన్నింటి ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ అంశం కూడా రెపో రేట్ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది.
CPI ద్రవ్యోల్బణం రేట్, వరుసగా నాలుగో నెలలోనూ, ఆర్‌బీఐ గరిష్ట సహన పరిమితి అయిన 6% లోపే ఉంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69% గా నమోదైంది. నవంబర్‌లోని 5.55% నుంచి కొంచెం పెరిగినా, మార్కెట్ అంచనా 5.87% కంటే మెరుగ్గా ఉంది. అయితే, ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 8.7% నుంచి 9.5% కు పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం వల్లే CPI ఇన్‌ఫ్లేషన్ గత నాలుగు నెలల్లోనే అత్యధికంగా డిసెంబర్‌లో 5.69% కు చేరింది.
దేశాభివృద్ధికి మద్దతునిస్తూనే, ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యిత స్థాయికి దిగి వచ్చేలా.. మార్కెట్ స్నేహపూర్వక వైఖరిని తగ్గించడంపై ఎంపీసీ దృష్టి పెట్టొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Banks, Auto, Zomato, Adani Ports