Wealth Tax: మళ్లీ తెర పైకి సంపద పన్ను, అమల్లోకి వచ్చిందంటే 2 శాతం బాదుడు
Tax On Wealthy: సంపద పన్ను విధిస్తే, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో (GDP) 2.73 శాతానికి సమానమైన భారీ ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించవచ్చు.
![Wealth Tax: మళ్లీ తెర పైకి సంపద పన్ను, అమల్లోకి వచ్చిందంటే 2 శాతం బాదుడు wealth tax in india a latest research report amid elections suggests 2 percent wealth tax on wealthy Wealth Tax: మళ్లీ తెర పైకి సంపద పన్ను, అమల్లోకి వచ్చిందంటే 2 శాతం బాదుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/bb98b50ef32dece0c704390dfbe199d31716630982833545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Wealth Tax In India: మన దేశంలో ధనిక - పేద అంతరం తరాలుగా కొనసాగుతోంది, ఆ అగాథం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా దాఖలవుతున్న ఇన్‌కమ్ టాక్స్ రిటర్నులను (ITR) పరిశీలిస్తే, భారత్‌లో లక్షాధికారుల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో, పేదల పరిస్థితులు మాత్రం మెరుగుపడలేదు.
తెర పైకి వచ్చిన 'సంపద పన్ను' చర్చ
ప్రస్తుతం, దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) జరుగుతున్నాయి. ఈ తరుణంలో, దేశంలో సంపద పన్ను చర్చ మరోసారి తెర పైకి వచ్చింది. ఆర్థిక అసమానతలను దృష్టిలో ఉంచుకుని, సంపన్నులపై ప్రత్యేక పన్ను విధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దేశంలోని ధనవంతులపై సంపద పన్ను విధించాలన్న వాదనను సమర్ధిస్తూ ఇటీవలే బయటకు వచ్చిన ఒక పరిశోధన పత్రం, ఆ చర్చను మళ్లీ తీవ్రతరం చేసింది.
'భారతదేశంలో తీవ్ర అసమానతలను తొలగించేందుకు సంపద పన్ను ప్యాకేజీ ప్రతిపాదన' పేరుతో వెలువడిన పరిశోధన నివేదికను రూపొందించడంలో ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్ పికెట్టీ కూడా సహకరించారు. సంపన్నుల ఆస్తులపై 2 శాతం సంపద పన్ను విధించాలని ఆర్థికవేత్తలు పరిశోధన పత్రంలో సిఫార్సు చేశారు. దీనితో పాటు, 33 శాతం వారసత్వ పన్నును (Inheritance tax) కూడా సూచించారు.
రూ.10 నికర విలువ దాటిన వ్యక్తులపై...
ఆ పరిశోధన ప్రకారం... "రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద (Net Worth) ఉన్న వ్యక్తులపై సంపద పన్ను విధించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అసమానతలను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా ప్రయోజనం పొందుతుంది. సంపద పన్ను విధిస్తే, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో (GDP) 2.73 శాతానికి సమానమైన భారీ ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించవచ్చు".
చాలా తక్కువ మందిపై మాత్రమే ప్రభావం
రూ. 10 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద కలిగిన వ్యక్తులపై ప్రతిపాదిత పన్ను విధిస్తే, అది అతి తక్కువ మంది వ్యక్తులపై ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు పరిశోధన పత్రంలో వెల్లడించారు. నివేదిక ప్రకారం, 99.96 శాతం మంది జనాభాపై పన్ను భారం పడదు. ఎందుకంటే, రూ.10 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల శాతం చాలా తక్కువగా ఉంది.
భారతదేశంలో ఆర్థిక అసమానతలకు సంబంధించిన చాలా నివేదికలు, పరిశోధన పత్రాల్లో తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో దేశంలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరిగాయని, ధనవంతుల వద్ద సంపద పోగుపడుతోందని కూడా తాజా పరిశోధనలో తేలింది. 2022-23 నాటికి, దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం పైగా వాటా కేవలం 1 శాతం మంది సంపన్నుల చేతుల్లోనే ఉంది. మొత్తం దేశ ఆదాయంలో వాళ్లు 22.6 శాతం వాటాదార్లు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా సహా చాలా దేశాల కంటే చాలా ఎక్కువ.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సంపద పన్నును సిఫారసు చేస్తూ పరిశోధన నివేదికను ప్రచురించడం గమనార్హం. ఓటింగ్ ప్రక్రియ గత నెలన్నర రోజులుగా కొనసాగుతోంది. ఏడు & చివరి దశ పోలింగ్ జూన్ 01న జరుగుతుంది. జూన్ 04న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
మరో ఆసక్తికర కథనం: రూ.25 వేల జీతం ఉన్నా కోటి రూపాయలు సంపాదించొచ్చు, అదేమీ బ్రహ్మవిద్య కాదు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)