SBI Credit Card ALERT : ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లకు షాక్! ఇకపై ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్న సంస్థ
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ షాకిచ్చింది. డిసెంబర్ నుంచి ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తామని వెల్లడించింది. దీంతో కస్టమర్లపై అదనపు భారం పడనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు షాకిచ్చింది! ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేపట్టిన ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్ రుసుము, దాంతో పాటు పన్నులూ వసూలు చేస్తామని ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ తెలిపింది. 2021, డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. శనివారం నుంచి ఇందుకు మరో 17 రోజులే మిగిలుంది. రిటైల్ షాపులు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈకామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేసిన వాటి ఈఎంఐల పైనా రుసుము వసూలు చేస్తారు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంస్థ శుక్రవారం ఒక మెయిల్ పంపించింది. 'ప్రియమైన వినియోగదారుడా! మర్చంట్ ఔట్‌లెట్, వెబ్‌సైట్, యాప్‌ల్లో చేసే అన్ని రకాల ఈఎంఐ లావాదేవీలపై 2021, డిసెంబర్ 1 నుంచి రూ.99 ప్రాసెసింగ్ ఫీజు, పన్నులు వర్తిస్తాయి' అని ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ మెయిల్‌లో వివరించింది. ఈ నిబంధన వల్ల కోట్లాది మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
సాధారణంగా ఈఎంఐ లావాదేవీలపై బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తూ వ్యాపారస్థులే వినియోగదారులకు రాయితీలు ఇస్తున్నారు. కొనుగోలు చేసినప్పుడు 'జీరో ఇంట్రెస్ట్' ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇలాంటి లావదేవీల పైనా డిసెంబర్ 1 నుంచి ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయనున్నారు. ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీల పైనే రుసుము చెల్లించాలి. సంబంధిత లావాదేవీ విఫలమైతే ఫీజు తిరిగి ఇచ్చేస్తారు. ప్రీ క్లోజర్ చేస్తే మాత్రం ఇవ్వరు.
ముందే ఉపయోగించిన లావాదేవీ ఈఎంఐ డిసెంబర్ తర్వాత మొదలవుతుంటే దానిపై ప్రాసెసింగ్ ఫీజు ఏమీ ఉండదు. కానీ రివార్డు పాయింట్లైతే ఇవ్వరు. 'పరిశ్రమ ప్రమాణాల ప్రకారమే ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ప్రైవేటు సంస్థలు చాన్నాళ్ల నుంచే దీనిని వసూలు చేస్తున్నాయి' అని సంస్థకు చెందిన ఒకరు మీడియాకు తెలిపారు.
వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఈఎంఐల్లో కలిసే ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనే పథకాలపై దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!
Also Read: Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి