Rules Changes From October 2025: అక్టోబర్ 1 నుంచి జరిగే మార్పులివే, ఈ నియమాలు మీ జేబుపై ప్రభావం చూపుతాయి
Rules will change from 1st October | భారత్‌లో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు సంభవిస్తాయి. అక్టోబర్ 1 నుండి NPS, యూపీఐ లావాదేవీలు, రైల్వే టికెట్ల నియమాలు మారనున్నాయి.

Rules will change from 1st October 2025: సెప్టెంబర్ నెల చివరికి వచ్చేసింది. రెండు రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. అక్టోబర్ 1, 2025 నుండి ఆర్థిక పరంగా పెద్ద మార్పులు అమలులోకి రానున్నాయి. అది కొందరి జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపితే, మరికొందరి జీవితాలపై పరోక్షంగా ప్రభావం చూపుతుంది. వాటి గురించి మీకు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం.
నేషనల్ పెన్షన్ సిస్టమ్
అక్టోబర్ 1, 2025 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో పెద్ద మార్పు గమనిస్తారు. ఇందులో ప్రభుత్వేతర రంగంలో పనిచేసే సభ్యులకు మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద ఈక్విటీలో 100 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడానికి అనుమతి ఉంటుంది. అంటే, అక్టోబర్ 1వ తేదీ నుంచి NPS లోని ప్రభుత్వేతర సభ్యులు తమ పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా షేర్ మార్కెట్‌కు సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించారు.
ఇంతకుముందు ఈక్విటీలో పెట్టుబడి పరిమితి 75 శాతం మాత్రమే ఉండేది. దీంతో పాటు, ప్రభుత్వ రంగంలోని ఉద్యోగుల మాదిరిగానే, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా PRAN (Permanent Retirement Account Number) తెరవడానికి ఈ-PRAN కిట్‌కు రూ.18, ఫిజికల్ PRAN కార్డు కోసం రూ.40 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వార్షిక మెయింటనెన్స్ ఛార్జీ ఒక్కో ఖాతాకు రూ.100 ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana), NPS లైట్ సభ్యులు PRAN ప్రారంభ ఛార్జీ, నిర్వహణ ఛార్జీ రూ.15 చెల్లించాలి. అయితే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీ వసూలు చేయరు.
రైల్వేల్లో 15 నిమిషాల్లో ఆధార్ ధృవీకరణ
అక్టోబర్ 1, 2025 నుంచి జరిగే రెండవ పెద్ద మార్పు రైల్వేకు సంబంధించినది. దీని ప్రకారం, రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఆధార్ ధృవీకరణ పొందిన వ్యక్తులు మాత్రమే టిక్కెట్‌లను బుక్ చేసుకునే వీలుంటుంది. అయితే, కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్ల నుండి టిక్కెట్లు తీసుకునేవారికి సమయం లేదా ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. దీనితో పాటు, రైల్వే అధీకృత ఏజెంట్లు రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 10 నిమిషాల వరకు టిక్కెట్‌లను బుక్ చేయలేరు. ఈ మార్పుల లక్ష్యం ఏమిటంటే రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో మోసాలను అరికట్టడం, నిజమైన వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై ఉచ్చు బిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025కి ఆమోదం తెలిపింది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. దీని లక్ష్యం ఏమిటంటే డబ్బుతో గేమింగ్ వ్యసనం, ఆర్థిక నష్టాన్ని నివారించడం. అలాగే ఈ-స్పోర్ట్స్ ను ప్రోత్సహిస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, అయితే ప్రమోటర్లకు రెండేళ్ల జైలు శిక్ష, 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
ఎల్పీజీ సిలిండర్లలో మార్పులు
అక్టోబర్ 1వ తేదీ నుంచి వంట గ్యాస్ సిలిండర్ల ధర (LPG Cylinder Price)లలో పెద్ద మార్పు రానుంది. ఈ మార్పు నేరుగా మీ నెలవారి బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. ఇంతకుముందు, చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చాయి, అయితే 14 కిలోల గృహ వంట గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 8, 2025న ఢిల్లీ-ముంబై, కోల్‌కతా-చెన్నై, ఇతర నగరాల్లో మార్పులు చేశారు. దీనితో పాటు, ATF, CNG, PNG ధరలలో కూడా మార్పులు ఉండవచ్చు.
UPI పేమెంట్లలో మార్పులు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో అక్టోబర్ 1 నుండి పెద్ద మార్పులు అమలులోకి వస్తాయి. NPCI ద్వారా అమలవుతున్న ఈ కొత్త మార్పులు PhonePe, Google Payలతో పాటు Paytm వినియోగదారులపై ప్రభావం చూపుతాయి. NPCI ఎక్కువగా ఉపయోగించే UPI ఫీచర్లలో ఒకటైన పీర్-టు-పీర్ (P2P) లావాదేవీని తొలగించాలని భావిస్తున్నారు. వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడానికి, ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఈ ఫీచర్ అక్టోబర్ 1, 2025 నుండి UPI యాప్‌ల నుండి తొలగించనున్నారు. జూలై 29 నాటి సర్క్యులర్‌లో ఈ సమాచారం ఇచ్చారు.






















