Laptop Import Ban: అలర్ట్! ఈ ల్యాప్‌టాప్‌లను బ్యాన్ చేసిన మోదీ సర్కారు!
Laptop Import Ban: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం విధించింది.
Laptop Import Ban:
కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు (Laptops), ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ క్షణం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయయని ప్రకటించింది. భద్రతా కారణాలు, స్థానిక తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో భద్రతకు ముప్పు నెలకొందని కేంద్రం భావిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయంతో చైనా, కొరియా నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతి తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ, లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నమ్మకమైన భాగస్వాముల నుంచే దిగుమతి చేసుకొనేందుకు ఈ చర్యలు దారితీస్తాయని అధికారులు అంటున్నారు. మొత్తంగా కొత్త కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఆవిష్కరణ భారత మార్కెట్లో ఆలస్యం అవుతుంది. 'బ్యాగేజ్ నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకొనే ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదు' అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, టాబ్లెట్, పర్సనల్ కంప్యూటర్, అల్ట్రా స్మాల్ ఫామ్ కంప్యూటర్ దిగుమతులను నిషేధం, లైసెన్సింగ్ నుంచి మినహాయిస్తున్నామని కేంద్ర తెలిపింది. 20 ఐటెమ్స్‌తో వచ్చే కన్‌సైన్‌మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అవీ పరిశోధన, అభివృద్ధి టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్, అసెస్‌మెంట్, రిపేర్, రీ ఎక్స్‌పోర్ట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసమే వాడుకోవాలి. అంతేకాకుండా స్థానికంగా అస్సలు విక్రయించకూడదు.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య నాటికి ఎలక్ట్రానిక్స్ దిగుమతలు విలువ 19.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏటా 6 శాతం వృద్ధితో విస్తరిస్తోంది. దీనిని ఒక అవకాశంగా మలుచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్ణయించుకుంది. ప్రస్తుతం దిగుమతుల్లో 1.5 శాతం వరకు కంప్యూటర్లు, లాప్‌ట్యాపులు, ట్యాబ్లెట్లే ఉంటున్నాయి. ఇందులో సగం వరకు చైనా నుంచే వస్తున్నాయి. గతంలో మొబైల్ ఫోన్లపై అధిక టారిఫ్, పన్నులు పెంచడం వల్ల స్థానిక పరిశ్రమకు ఉద్దీపన లభించింది. దాంతో గతేడాది 38 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఉత్పత్తి చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాల పథకాన్ని ఎలక్ట్రానిక్స్ సహా 12 రంగాలకు విస్తరించింది. రెండు బిలియన్ డాలర్ల తయారీ రంగ ప్రోత్సాహక ప్రణాళికకు దరఖాస్తు సమయాన్ని పొడగించింది. ఫలితంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీ, సేవల్లో భారీ ఎత్తున పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంది. 2026 కల్లా ఏటా 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
భారత్ ల్యాప్‌టాప్ ఇండస్ట్రీలో హెచ్‌పీ, డెల్, ఏసెర్, సామ్‌సంగ్, ఎల్‌జీ, యాపిల్, లెనోవో వంటి అంతర్జాతీయ కంపెనీలకు మార్కెట్ వాటా ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే అవకాశం లేకపోవడంతో ఇప్పడా కంపెనీలు స్థానికంగా ప్రొడక్షన్‌ను ఆరంభించే అవకాశం ఉంది. స్థానిక మార్కెట్లలో అవకాశాలను వెతుక్కోనున్నాయి.
Also Read: మీకు రూ.15,490 రీఫండ్ వస్తోంది! ఆ మెసేజ్ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.