Market Crash: బుల్స్ చేజారిన మార్కెట్లు.. ఇంట్రాడేలో యూటర్న్ రికార్డు పతనం ఎందుకంటే..
Stock Markets: ఉదయం కొనుగోళ్ల మద్ధతులో లాభాల రికార్డులు మోగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. సూచీల పతనం మార్కెట్ ఇన్వెస్టర్ల సంపదను లక్షల కోట్ల మేర ఆవిరిచేసింది.
Bear Markets: ఉదయం ఉల్లాసంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను సైతం తాకాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 75,000 పాయింట్ల మార్కును అధిగమించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ సైతం కొత్త గరిష్ఠ స్థాయి 22,794.70 పాయింట్లను అందుకుంది. అయితే ఈ లాభాల కోలాహలం ఎక్కువ మధ్యాహ్నం నాటికి ఒక్కసారిగా ఆవిరైపోయింది.
లక్షల కోట్లు ఆవిరి!
మధ్యాహ్నం 12 గంటల సమయానికి బెంచ్ మార్క్ సూచీల్లో తిరోగమనం కొనసాగింది. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా రివర్స్ గేర్ తీసుకోవటంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పతనం నమోదైంది. ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్ బేర్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల నుంచి ఏకంగా 1200 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో దేశీయ మార్కెట్లలోని రిటైల్ ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. పైగా వారి లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల విలువ క్షీణించింది.
వాస్తవానికి నేడు మార్కెట్ సూచీల్లో హెవీ వెయిట్ కలిగిన కొన్ని స్టాక్స్ విలువ పతనం మార్కెట్లను నష్టాల్లోకి లాగింది. ఈ క్రమంలో ఎల్&టి, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మెుత్తం మార్కెట్లను ఇంట్రాడేలో కిందకు లాగాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టాలను చవిచూశాయి. ఈ ప్రభావం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలపై కూడా కనిపించింది.
మధ్యాహానం 12.07 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీల ప్రయాణాన్ని గమనిస్తే.. సెన్సెక్స్ 609 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా, నిఫ్టీ సూచీ 151 పాయింట్లను కోల్పోయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 274 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 256 పాయింట్లను కోల్పోయి ముందుకు కొనసాగుతున్నాయి. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్ది నష్టాలు తగ్గుతూ ఉండటం కొంత ఊరటను కలిగిస్తోంది.
ఉదయం మార్కెట్లకు సహకరించిన అంశాలు:
ప్రస్తుతం మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయినప్పటికీ ఉదయం బుల్ జోరును కొనసాగించాయి. అయితే ఈ పరుగులకు కారణాలను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టాటజిస్ట్ విజయకుమార్ కారణాలను వివరించారు. ముందుగా యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ తగ్గటంతో పాటు క్రూడ్ ఆయిల్ ధర బ్రెంట్ 84 డాలర్లకు చేరుకోవటం సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఇదే క్రమంలో డాలర్ ఇండెక్స్ 105.3గా ఉంది. వీటికి తోడు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు బలమైన కొనుగోళ్లు మార్కెట్లకు అతిపెద్ద మూల స్థంభంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ల సైతం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించటం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లను లాభాలవైపు పురిగోలిపాయి. ఆసియా, జపాన్, హాంకాంగ్ మార్కెట్లు సైతం లాభాలను కొనసాగించటం దేశీయ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని బలపరిచింది. ఇది ఉదయం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ కొనుగోళ్లకు ఊతం ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు.