Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
వడ్డీరేట్లు తక్కువగా ఉండటం, స్టాంప్ ఫీజు తగ్గడం, బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో సొంత ఇంటి కలను చాలా మంది నెరవేర్చుకున్నారు. 2021లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 71 శాతం పెరిగాయని అనరాక్ తెలిపింది.
కొవిడ్ సమయంలోనూ దేశంలో ఇళ్ల గిరాకీ తగ్గలేదు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటం, స్టాంప్ ఫీజు తగ్గడం, బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో సొంత ఇంటి కలను చాలా మంది నెరవేర్చుకున్నారు. 2021లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 71 శాతం పెరిగాయని అనరాక్ తెలిపింది. మొత్తంగా 2,36,530 ఇళ్లు విక్రయించారు. అయితే గత రెండు సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్ మాత్రం తగ్గింది. 2019లో 2,61,358 యూనిట్లు విక్రయించగా 2020లో ఈ సంఖ్య 1,38,350గా ఉంది.
గతేడాది మొత్తం విక్రయాల్లో 39 శాతం నాలుగో త్రైమాసికంలోనే నమోదైంది. పండుగల సీజన్ కావడం ఇందుకు దోహదం చేసింది. ముంబయి మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 72 శాతం పెరిగాయి. అంతకు ముందు 44,320తో పోలిస్తే 76,400 విక్రయించారు. ఇక హైదరాబాద్ నగరంలోనూ విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. 2020లో 8,560 యూనిట్లతో పోలిస్తే 2021లో 25,410కి పెరిగింది.
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 73 శాతం పెరిగాయి. 2020లో 23,210 యూనిట్లు విక్రయించగా 2021లో 40,050 విక్రయించారు. పుణెలో 2020లో 23,460 అమ్మగా 2021లో 35,980 అమ్మారు. అంటే 53 శాతం పెరుగుదల కనిపించింది. బెంగళూరులో ఇది 33 శాతంగా ఉంది. 2020లో అక్కడ 24,910 ఇళ్లు విక్రయించగా 2021లో 33,080 అమ్మాయి. చెన్నైలో ఏకంగా 86 శాతం వృద్ధి నమోదైంది. 2021లో 12,530 యూనిట్లు విక్రయించారు. 2020లో ఇది 6,740 కావడం గమనార్హం. కోల్‌కతాలో 2020లో 7,150 యూనిట్లు విక్రయించగా 2021లో 13,080 అమ్మారు.
'కరోనా వైరస్ ఉన్నప్పటికీ 2020, 2021లో ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. కరోనా ఉన్నంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది' అని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి అన్నారు. నమ్మకమైన డెవలపర్స్ 2020లో కొవిడ్ ముందు స్థాయికి అమ్మకాలు పెంచగలరని ధీమా వ్యక్తం చేశారు. ముడి వనరులు, నిర్మాణ పరికరాలు, సరఫరా ఇబ్బందులతో ఇళ్ల ధరకు 5-8 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. 2021లో ఈ ఏడు ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం 85 పెరిగి 2,36,700 యూనిట్లకు చేరుకుంది. గతేడాది ఈ సంఖ్య 1,28,000 అని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త ఇళ్ల సంఖ్య 21,110 నుంచి 51,470కు పెరిగిందన్నారు.
Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!
Also Read: Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!