Cement Prices: మంట పుట్టిస్తున్న సిమెంటు, సొంతింటి కల మరింత ఖరీదు గురూ!
ఒక్కో బస్తాకు 50 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పెరిగింది.
House Construction Cost: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి/కట్టుకుంటున్న వారికి ఇది చేదువార్త. గత కొన్ని నెలల క్రితం తగ్గి కాస్త ఉపశమనం కల్పించిన సిమెంట్ రేట్లు, కొన్నాళ్లుగా మళ్లీ పెరగడం ప్రారంభించాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్ కాలం) సిమెంట్ ధరలు అప్‌స్టెయిర్స్ ఎక్కాయి. ప్రస్తుత పండుగల సీజన్‌లోను, ఆ తర్వాత కూడా ఇదే సినిమా రిపీట్ అవుతుందని అంచనా. ఫలితంగా ఇంటి నిర్మాణ ఖర్చు పెరుగుతూనే ఉంటుందని భావిస్తున్నారు.
ఒక్క నెలలోనే భారీగా పెరుగుదల
బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లెక్కల ప్రకారం... సెప్టెంబర్ నెలలో సిమెంట్ సగటు రిటైల్ రేటు ఒక నెల క్రితంతో (QoQ) పోలిస్తే, అంటే ఆగస్టుతో పోలిస్తే 4 శాతం పెరిగింది. త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే... అంతకుముందు త్రైమాసికం (2023 ఏప్రిల్-జూన్) సగటు ధర కంటే సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు ధర 0.5 శాతం నుంచి 1 శాతం జంప్ చేసింది.
వాస్తవానికి, గత మూడు సంవత్సరాల్లో, జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రేట్లు తగ్గాయి, ఒక్కో బ్యాగ్ రేటు సగటున 14 రూపాయలు పడిపోయింది. రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాల్లో మందగమనం దీనికి కారణం. ఈ సంవత్సరం సీన్ రివర్స్ అయింది, ధర పెరిగింది.
సిమెంట్ రిటైల్ రేట్లు పెరగడానికి కారణం ఇదే
తూర్పు భారతదేశంలో సిమెంట్ ధరల పెరుగుదలే మొత్తం సిమెంట్ రంగంలో రేట్ల పెరుగుదలకు కారణంగా జెఫరీస్ ఇండియా ఎనలిస్ట్‌లు విశ్లేషించారు. పెరిగిన ఇంధనం ధరలను సిమెంట్ కంపెనీలు భరించడానికి బదులు, ఆ భారాన్ని వినియోగదార్ల నెత్తిన మోపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్‌కోక్/బొగ్గు ధరలు సెప్టెంబర్‌లో బాగా పెరిగాయి. ఈ ఏడాది జులై ఆఖరు నుంచి సెప్టెంబర్ వరకు 30-40% జంప్ చేశాయి. పెరిగిన ఇంధన వ్యయం వల్ల సిమెంట్ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఆ ప్రభావం తగ్గించుకునేందుకు సిమెంట్ రిటైల్ ధరలను కంపెనీలు పెంచుతున్నాయి.
జెఫరీస్ ఇండియా గణాంకాలను బట్టి చూస్తే, మిగిలిన ప్రాంతాల కంటే తూర్పు భారతదేశంలోనే సిమెంట్ ధరలు ఎక్కువగా పెరిగాయి. తూర్పు భారతదేశంలో, ఆగస్టు నెలాఖరులో సిమెంట్ బస్తా మీద ఉన్న MRP సెప్టెంబర్ చివరి నాటికి మారిపోయింది, ఒక్కో బస్తాకు 50 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లో సిమెంట్ బస్తా రిటైల్ ప్రైస్ కాస్త తక్కువగా, ఒక్కో బస్తాకు 20 రూపాయల వరకు పెరిగింది. తూర్పు భారతదేశంతో పోలిస్తే, దక్షిణ భారతదేశంలో సిమెంట్ కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. కాబట్టి, ఈ ప్రాంతంలో ఇకపై కూడా రేటు ఎక్కువగా పెరిగే అవకాశాలు లేవు.
కొన్ని నెలల క్రితం వరకు సిమెంట్ ధర బాగా తగ్గింది. జులై నెలలో సిమెంట్ చాలా చౌకగా మారింది. అయితే, గత రెండు నెలల నుంచి బుల్లిష్ ట్రెండ్ తిరిగి వచ్చింది. రాబోయే నెలల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుందని జెఫరీస్ ఇండియా ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు. వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో, నిర్మాణాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం, రుతుపవనాల ప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల సిమెంట్ రంగానికి డిమాండ్ కొనసాగుతోంది. దీనిని బట్టి, ఇంటి నిర్మాణ ఖర్చు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.
మరో ఆసక్తికర కథనం: ఫారినర్ల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఐటీ స్టాక్స్, రెండున్నర నెలల్లో రూ.7 వేల కోట్ల షాపింగ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial