Aadhaar Updation: ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువు పెంపు, మరో 3 నెలలు ఛాన్స్
Free Updation Of Aadhaar Card: మీ ఆధార్ కార్డ్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి బంగారం లాంటి అవకాశం ఇది. మీకు మరో మూడు నెలల సమయం దొరికింది.
Free Updation Of Aadhaar Card Deadline Extended: ఆధార్ వినియోగదార్లకు గుడ్ న్యూస్. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI లేదా ఉడాయ్), ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును మరోసారి పొడిగించింది. గతంలో ప్రకటించిన ఈ ఈ నెల (జూన్) 14వ తేదీతో ముగుస్తుంది. ఈ తుది తేదీని ఇప్పుడు మరో మూడు నెలల ముందుకు జరిపింది ఉడాయ్.
భారతదేశ పౌరులకు ఆధార్ జారీ చేసే ప్రాధికార సంస్థ అయిన UIDAI, ఆధార్ అప్‌డేషన్ గడువును మూడు నెలలు పొడిగించిన విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆ సమాచారం ప్రకారం, భారత ప్రజలు తమ ఆధార్ కార్డ్‌లోని వివరాలను 14 సెప్టెంబర్ 2024 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
భారత ప్రజల గుర్తింపు ఆధార్ కార్డుల్లో ఆధార్ చాలా ముఖ్యమైనది. బ్యాంకు ఖాతా ప్రారంభించడం దగ్గర నుంచి వృద్ధాప్య పింఛను వంటి ప్రభుత్వ పథకాలు పొందడం వరకు, రోడ్ బస్ టిక్కెట్ బుకింగ్ నుంచి ఎయిర్ బస్ టిక్కెట్ తీయడం వరకు. ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం దగ్గర నుంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేరే వరకు.. ఇలా మనిషి జీవన ప్రయాణంలో ఆధార్ ఒక కీలక భాగంగా మారింది. జననం నుంచి మరణం వరకు ప్రతి దశలోనూ, ప్రతి విషయానికీ ఆధార్ ఉపయోగపడుతుంది.
ఆధార్ అప్‌డేట్ చేయకపోతే జాతకం మారిపోతుంది
ఒక విధంగా చెప్పాలంటే, ఆధార్ కార్డ్ అనేది ఒక వ్యక్తి జాతక చక్రం వంటింది. అందులో ఆ వ్యక్తి పేరు, జెండర్, చిరునామా, వయస్సు, ఐరిస్, బయోమెట్రిక్ సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఆధార్‌కు ఉన్న ప్రాముఖ్యత కారణంగా, దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించకపోతే జాతకం మారిపోతుంది. అంటే, అందాల్సిన ప్రయోజనాలన్నీ దూరం అవుతాయి.
ఆధార్ కార్డ్ తీసుకుని 10 సంవత్సరాలు దాటి ఉంటే, అలాంటి వ్యక్తులంతా వీలైనంత త్వరగా వివరాలను అప్‌డేట్ చేయాలని పౌరులందరికీ UIDAI సూచించింది. వివరాలను నవీకరించడానికి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసే సదుపాయం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలను నవీకరించుకోవాలంటే దానికి కొంత ఫీజ్ చెల్లించాలి.
ఆన్‌లైన్ ఆధార్‌లో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి? (How to Update Aadhaar Details Free in Online?)
-- ముందుగా, ఉడాయ్ అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ ను ఓపెన్ చేయండి.
-- మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP సాయంతో ఈ పోర్టల్‌లో లాగిన్ కావాలి.
-- పేరు, జెండర్, చిరునామా వంటి మీ వ్యక్తిగత వివరాలన్నింటినీ చెక్ చేయండి.
-- చిరునామా, పేరు, జెండర్ వంటివి మార్చాలనుకున్నా, తప్పులు సరిచేయాలనుకున్నా దానికి సంబంధించిన ఆప్షన్ ఎంచుకోండి.
-- వివరాలను సరిచేయడానికి అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేయండి.
-- తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
ఇక్కడితో, ఆధార్ అప్‌డేషన్ ప్రాసెస్‌లో మీ వంతు పని పూర్తవుతుంది. ఇక జరగాల్సిన పనిని ఉడాయ్ చూసుకుంటుంది. మీరు సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేస్తుంది. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత, మీకు 14 అంకెల URN వస్తుంది. దీని ద్వారా మీ ఆధార్ అప్‌డేట్ ప్రాసెస్‌ను ట్రాక్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ధనలక్ష్మిని మీ ఇంటికి తెచ్చే బెస్ట్ మ్యూచవల్ ఫండ్స్ ఇవి, ఈ నెల వరకే ఛాన్స్