Forex Reserves: టాప్ గేర్‌లో జీఎస్‌టీ వసూళ్లు, రివర్స్ గేర్‌లో ఫారెక్స్ రిజర్వ్స్ - ఎందుకిలా?
Foreign Currency News: గత మూడు వారాల్లోనే, జీవితకాల గరిష్ట స్థాయి నుంచి, భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 10.64 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.
Foreign Currency Reserves in India: ఓవైపు దేశ ఆర్థికాభివృద్ధి పుంజుకుంటూ, జీఎస్‌టీ రికార్డ్ (GST Collection Record) స్థాయిలో వసూలవుతుంటే, 'భారతదేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు' (India's Forex Reserves) మాత్రం వరుసగా మూడో వారంలోనూ తగ్గాయి. మూడు వారాల క్రితం రికార్డ్ స్థాయికి చేరిన ఫారెక్స్ రిజర్వ్స్, ఇప్పుడు ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్నాయి. దేశంలోని విదేశీ నగదు నిల్వల తాజా గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది.
ఆర్‌బీఐ ఇచ్చిన తాజా డేటా ప్రకారం, 2024 ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు 2.412 బిలియన్ డాలర్లు తగ్గి 637.922 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. దీనికి ముందు, ఏప్రిల్ 19న, విదేశీ ద్రవ్య రాసులు 2.28 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకంటే ముందు ఈ మొత్తం 643.16 బిలియన్ డాలర్లుగా ఉంది.
మూడు వారాల క్రితం, క్రమంగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వ్స్, 2024 ఏప్రిల్ 05తో ముగిసిన వారంలో 648.562 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి, ఇది జీవితకాల గరిష్ట రికార్డ్ (Forex reserves all-time high record). దీనికి ముందున్న రికార్డ్ 2021 సెప్టెంబర్ నాటిది. అప్పుడు విదేశీ మారక ద్రవ్య నిల్వల విలువ 642.453 బిలియన్ డాలర్లకు చేరింది. రెండున్నర సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ రికార్డు బద్దలైంది.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, సమీక్ష కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించాయి. 2024 ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 1.159 బిలియన్ డాలర్లు తగ్గి 559.701 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ మారక నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తులు ఒక ప్రధాన భాగం. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువ. అమెరికన్ డాలర్ల రూపంలో ఈ విలువను లెక్కిస్తారు.
తగ్గిన పసిడి ప్రకాశం
ఆర్‌బీఐ దగ్గర గత కొన్ని వారాలుగా నిరంతంర పెరుగుతూ వస్తున్న బంగారం నిల్వలు ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో తగ్గాయి. RBI గోల్డ్ ఛెస్ట్ (Gold reserves In India) విలువ 1.275 బిలియన్ డాలర్లు పెరిగి 55.533 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 15 మిలియన్ డాలర్ల వృద్ధితో 18.048 బిలియన్ డాలర్లకు పెరిగాయని కేంద్ర బ్యాంక్ లెక్కలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు 8 మిలియన్ డాలర్లు పెరిగి 4.639 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.
2024 ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో రాజకీయ-భౌగోళిక టెన్షన్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో, డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారకం విలువ పతనమైంది. ఈ పతనాన్ని ఆపడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మార్కెట్‌లో జోక్యం చేసుకుందని, అమెరికన్ డాలర్లను భారీగా విక్రయించిందని సమాచారం. ఈ కారణం వల్లే భారత్‌లో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గాయని చెబుతున్నారు. గత మూడు వారాల్లోనే, జీవితకాల గరిష్ట స్థాయి నుంచి, భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 10.64 బిలియన్ డాలర్లు తగ్గాయి.
మరో ఆసక్తికర కథనం: ఐపీవో మార్కెట్‌లో పెను తుపాను, 543 రెట్లు సబ్‌స్క్రిప్షన్, టాటా కంపెనీలకు కూడా రాని రెస్పాన్స్