PF Balance: EPFO సైట్‌లో ఈ-పాస్‌బుక్ ఓపెన్ కావట్లేదా?, ఇంటర్నెట్ లేకపోయినా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు
ఆ చిట్కాలను పాటిస్తే, ఇంటర్నెట్ లేకుండానే మీ భవిష్య నిధి ఖాతాలోని నిల్వ గురించి నిమిషాల వ్యవధిలో తెలుసుకోవచ్చు.
PF Balance Check: దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్ ఖాతాదార్లలో చాలామంది, తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో (PF account) నిల్వను చెక్ చేయడంలో, పాస్‌బుక్‌ను తనిఖీ చేయడంలో గత కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక పరమైన ఇబ్బందుల కారణంగా తమ పీఎఫ్ మొత్తం గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమస్య మీకు కూడా ఎదురైందా?. ఈ సమస్య పరిష్కారానికి రెండు సులభ మార్గాలు ఉన్నాయి. ఆ చిట్కాలను పాటిస్తే, ఇంటర్నెట్ లేకుండానే మీ భవిష్య నిధి ఖాతాలోని నిల్వ గురించి నిమిషాల వ్యవధిలో తెలుసుకోవచ్చు.
అయితే, దీనికి ఒక్క షరతు ఉంది. ముందుగా, మీ PF ఖాతాకు సంబంధించి KYC ప్రక్రియ పూర్తయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ లేకుండా PF బ్యాలెన్స్‌ని మీరు తనిఖీ (PF account balance check without internet) చేయవచ్చు. అలాగే, మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా UAN (Universal Account Number) కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ రెండు విషయాలు లేకుండా బ్యాలెన్స్ తనిఖీ చేయలేరు.
ఇంటర్నెట్ లేకుండా PF ఖాతాలోని నిల్వ మొత్తాన్ని తెలుసుకోవడం ఎలా?
ఈ నంబర్‌కు SMS చేయండి
అన్నింటిలో మొదటిది... ఒక్క SMS ద్వారా మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మీ అకౌంట్‌లో KYC అప్‌డేట్ చేసి ఉంటే... మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO (స్పేస్) UAN (స్పేస్) ENG అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు SMS పంపాలి. ఈ ఫార్మాట్‌ను కచ్చితంగా పాటించాలి, స్పేస్ మిస్ చేయకూడదు. మీ ఖాతాలో జమ అయిన మొత్తం గురించి, కొన్ని నిమిషాల్లోనే ఆంగ్ల భాషలో మీకు తిరిగి సమాచారం అందుతుంది. ఇంగ్లీషుకు బదులుగా ఏదైనా ఇతర భాషను ఎంచుకోవాలనుకుంటే, ENGకి బదులుగా, ఆ భాషలోని మొదటి మూడు అక్షరాలను అక్కడ రాయాలి. ఉదాహరణకు.. మీకు మీ PF ఖాతా సమాచారం తెలుగులో కావాలని మీరు భావిస్తే... EPFOHO (స్పేస్) UAN (స్పేస్) TEL అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు SMS పంపాలి. మీ ఖాతాలోని నగదు మొత్తం గురించి కొన్ని నిమిషాల్లోనే మీకు తెలుగులో సమాచారం అందుతుంది.
ఒక్క మిస్డ్ కాల్ ద్వారా కూడా...
SMS ద్వారా కాకుండా, మీరు కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. మీ అకౌంట్‌లో KYC అప్‌డేట్ చేసి ఉంటే... మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. కాల్ డిస్‌కనెక్ట్ అయిన కొద్దిసేపటికే, EPFO నుంచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక సందేశం (SMS) వస్తుంది. పీఎఫ్ ఖాతా నిల్వ సహా మరికొంత సమాచారం అందులో ఉంటుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద EPF ఖాతా ఓపెన్ అవుతుంది. ఖాతా తెరిచిన తర్వాత, కంపెనీ & ఉద్యోగి ఇద్దరి తరపున ప్రతి నెలా కొంత మొత్తం ఆ ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తం ఇద్దరికీ సమానంగా ఉంటుంది. ఇది, పదవీ విరమణ పొదుపు పథకం లాంటిది. EPF ఖాతాలో జమ అయ్యే మొత్తంపై వడ్డీని ఏటా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ నాటికి ఆ మొత్తమంతా చేతికి వస్తుంది. అంతకంటే ముందే అత్యవసర పరిస్థితులు ఎదురైనా, పీఎఫ్ ఖాతాను నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.