UPS Update: కేంద్ర ఉద్యోగులకు దసరా ధమాకా ఆఫర్ - కొత్త స్కీమ్‌కు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్!
Central Government Employees: పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్‌లోని అనుకూల విషయాల కలబోతగా యూపీఎస్ ఉంటుంది. పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన పెన్షన్ వస్తుంది.
Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం (Unified Pension Scheme - UPS) వచ్చే ఏడాది ఏప్రిల్ (01 ఏప్రిల్ 2025) నుంచి అమలవుతుంది. అయితే, దీనిని ఇంకా ముందుగానే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో, దసరా-దీపావళి కానుకగా, 15 అక్టోబర్ 2024న ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయవచ్చని సమాచారం. ఈ నూతన పెన్షన్ (యూపీఎస్) పథకం భారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటి. లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని రూపొందించారు.
ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి సమావేశాలు
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, నూతన పెన్షన్ పథకాన్ని సులభంగా అమలు చేయడానికి, కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ (Tv Somanathan) వివిధ మంత్రిత్వ శాఖలు & విభాగాలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, 'జాతీయ పెన్షన్ స్కీమ్'ను (NPS) సమీక్షించే బాధ్యతను అప్పగించిన కమిటీకి టీవీ సోమనాథన్ ఛైర్మన్‌గా ఉన్నారు. సోమనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏకీకృత పెన్షన్ పథకం అమలు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది.
UPS ప్రత్యేకత ఏంటి?
రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా స్థిరమైన మొత్తంలో పింఛను ఇవ్వడం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లక్ష్యం. అంటే, ఎన్‌పీఎస్‌లో లేని భరోసాను ఉద్యోగులు ఈ స్కీమ్‌లో పొందే అవకాశం ఉంది. నూతన పథకం కింద, కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణకు ముందు 12 నెలల 'ప్రాథమిక వేతనం + డీఏ' సగటు మొత్తాన్ని లెక్కేసి, అందులో సరిగ్గా సగం డబ్బును పెన్షన్‌గా ఇస్తారు. నెలనెలా స్థిరమైన మొత్తంలో పింఛను అందుతుంది. చేతిలోకి వచ్చే డబ్బు ఎంతో ముందే తెలుస్తుంది కాబట్టి, దానికి తగ్గట్లుగా విశ్రాంత ఉద్యోగులు తమ ఖర్చులను మేనేజ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లోనూ ఉద్యోగులు పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్ చేయాలి. ఉద్యోగులు తమ 'ప్రాథమిక వేతనం + DA'లో 10 శాతాన్ని NPSలో జమ చేస్తున్నట్లుగానే, యూపీఎస్‌లోనూ పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలి. ఎన్‌పీఎస్‌లో, ఉద్యోగుల పెన్షన్ ఫండ్‌కు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 14 శాతంగా ఉంటే, యూపీఎస్‌లో 18.5 శాతం జమ చేస్తుంది. అంటే, యూపీఎస్‌లో ప్రభుత్వ సహకారం పెరుగుతుంది. ఏకీకృత పెన్షన్ పథకం కింద, ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 25 సంవత్సరాల సర్వీస్ తర్వాత మాత్రమే నిర్దేశిత ఫార్ములా కింద 'హామీతో కూడిన పెన్షన్' పొందేందుకు అర్హులు. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 24న, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: స్విగ్గీ నుంచి 10 నిమిషాల్లో ఫుడ్ డెలివెరీ, హైదరాబాద్‌లో కొత్త సర్వీస్