Hurun India Rich List: బిలియనీర్స్ లిస్ట్‌లో ముకేశ్ అంబానీ ఆధిపత్యం, ముంబైకి ఫస్ట్ ర్యాంక్
ముఖేష్ అంబానీ సంపద 2014లోని రూ. 1,65,100 కోట్ల నుంచి 2023 ఆగస్టు నాటికి దాదాపు రూ. 8,08,700 కోట్లకు పెరిగింది, ఇది నాలుగు రెట్ల వృద్ధి.
Hurun India Rich List 2023: '360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023'లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్ అంబానీ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి, అత్యంత సంపన్న భారతీయుడు బిరుదును తిరిగి సొంతం చేసుకున్నారు. గౌతమ్ అదానీ సంపద విలువ భారీగా తగ్గిపోగా, అంబానీ ఆస్తుల విలువ పెరగడమే దీనికి కారణం.
హురున్ ఇండియా, 360 వన్ వెల్త్ కలిసి సర్వే చేసి, '360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023'ని (360 ONE WEALTH HURUN INDIA RICH LIST 2023) రిలీజ్ చేశాయి. భారతదేశంలోని అత్యంత సంపన్నుల 12వ వార్షిక లిస్ట్. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి వ్యక్తుల ఉన్న సంపద ఆధారంగా సర్వే జరిగింది. దేశంలోని 138 నగరాల నుంచి 1,319 మంది ధనవంతుల పేర్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సంపద విలువ
గత దశాబ్దంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ $150 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని, ఇది భారతదేశంలోని ఇతర కార్పొరేషన్ల కంటే ఎక్కువ అని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 వెల్లడించింది. ఈ కాలంలో, ముఖేష్ అంబానీ సంపద 2014లోని రూ. 1,65,100 కోట్ల నుంచి 2023 ఆగస్టు నాటికి దాదాపు రూ. 8,08,700 కోట్లకు పెరిగింది, ఇది నాలుగు రెట్ల వృద్ధి. గత ఏడాది కాలంలో ముకేశ్ అంబానీ నెట్‌వర్త్ (Mukesh Ambani Networth) 2 శాతం పెరిగింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 57% క్షీణించింది. ఆయన రెండో స్థానానికి పడిపోయారు. గౌతమ్ అదానీ నెట్‌వర్త్ (Gautam Adani Networth) రూ. 4,74,800 కోట్లు. అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పడిపోవడం ఇందుకు కారణమని హురున్ ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు.
సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా భారతదేశంలో మూడో అత్యంత సంపన్న వ్యక్తి, అతని సంపద విలువ రూ. 2,78,500 కోట్లు.
టాప్ 10లో ఇంకా ఎవరెవరు ఉన్నారు?
HCLకు చెందిన శివ నాడార్ ఆస్తుల విలువ రూ. 2,28,900 కోట్లు, హురున్ 2023 జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ రూ. 1,76,500 కోట్లతో ఐదో ప్లేస్‌లో ఉంది. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత దిలీప్ షాంఘ్వీ రూ. 1,64,300 కోట్లతో ఆరో నంబర్ దక్కించుకున్నారు.
రూ. 1,62,300 కోట్ల ఆస్తులతో ఎల్‌ఎన్ మిట్టల్ & ఫ్యామిలీ ఏడో ర్యాంకు సాధించింది. రూ. 1,43,900 కోట్ల ఆస్తులతో రాధాకిషన్ దమానీ 8వ స్థానంలో ఉన్నారు. అయితే, ఈయన సంపద 18% పడిపోవడంతో మూడు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు వచ్చి పడ్డారు. రూ. 1,25,600 కోట్ల ఆస్తులతో కుమార్ మంగళం బిర్లా &ఫ్యామిలీ 9వ ప్లేస్‌లో; రూ. 1,20,700 కోట్ల ఆస్తులతో నీరజ్ బజాజ్ &ఫ్యామిలీ 10వ నంబర్‌లో ఉన్నాయి.
ఐదేళ్లలో భారీ పెరుగుదల
360 వన్ సహ వ్యవస్థాపకుడు, జాయింట్ CEO యతిన్ షా చెప్పిన ప్రకారం... ఈ 1,319 మంది వ్యక్తుల్లో ఒక్కొక్కరి వద్ద రూ. 1,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. వీళ్ల సంపద గత ఐదేళ్లలో 76 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో, ప్రతి మూడు వారాలకు ఇద్దరు కొత్త బిలియనీర్లు కొత్తగా యాడ్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ ఏడాది టైమ్‌లో 51 మంది సంపద రెట్టింపైంది.
బిలియనీర్ల నంబర్‌లో ఆర్థిక రాజధాని ముంబైది అగ్రస్థానం, ఈ నగరంలో 328 మంది బిలియనీర్లు నివశిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ (199), బెంగళూరు (100) నిలిచాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు టీసీఎస్ రిజల్ట్స్, షేర్ల బైబ్యాక్ ప్రకటన - కంపెనీ ఆదాయం, లాభంపై మార్కెట్ ఆలోచనలివి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial