Apple - Microsoft: సై అంటే సెకనుకో లక్షన్నర సంపాదిస్తున్న ఆపిల్, సెకండ్ ప్లేస్‌లో మైక్రోసాఫ్ట్
ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న కంపెనీగా ఆపిల్ రికార్డ్ క్రియేట్ చేసింది.
Apple - Microsoft: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న (ఒకరకంగా పిచ్చి) ఐఫోన్ (iPhone) తయారీ కంపెనీ ఆపిల్ (Apple), సై అంటే సెకనుకో లక్షన్నర రూపాయలు సంపాదిస్తోంది. మీరు సరిగ్గానే చదివారు. ఒక్క సెకనులో అక్షరాలా లక్షన్నర ఆర్జిస్తోంది ఆపిల్.
ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న కంపెనీగా ఆపిల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా అవతరించింది. Apple కంపెనీ ప్రతి సెకనుకు 1820 డాలర్లు, అంటే దాదాపు 1.48 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జిస్తోంది. రోజువారీ ప్రాతిపదికన చూస్తే, ఈ కంపెనీ ప్రతి రోజూ 157 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 1282 కోట్ల లాభం పొందుతోంది.
తోటి టెక్ కంపెనీలు కూడా ఏం తక్కువ తినట్లేదు. మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet), వారెన్ బఫెట్‌కు (Warren Buffett) చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే (Berkshire Hathaway) కూడా ప్రతి సెకనుకు 1,000 డాలర్లకు పైగా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు.
అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఫైనాన్షియల్ బిజినెస్ టిపాల్టీ (టిపాల్టీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ బిజినెస్) చేసిన కొత్త పరిశోధనలో ఈ భారీ లాభార్జన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్
ప్రపంచంలో లాభాల పరంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ ప్రతి సెకనుకు 1404 డాలర్లు అంటే 1.14 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. బెర్క్‌షైర్ హాత్వే ఒక్కో సెకను సంపాదన 1,348 డాలర్లు. అంటే, 1.10 లక్షల రూపాయలు.
ఫేస్‌బుక్ (Facebook) మాతృ సంస్థ మెటా (Meta Platforms) ఒక్కో సెకనుకు 924 డాలర్లు సంపాదిస్తోంది.
మరోవైపు, ఉబర్ టెక్నాలజీస్ (Ubar Technologies) గతేడాది 6.8 బిలియన్ డాలర్లు నష్టపోయింది. అంటే ప్రతి సెకనుకు 215 డాలర్ల నష్టాన్ని భరించింది.
ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ యాపిల్
మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ పరంగా చూస్తే, యాపిల్ ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 2.403 ట్రిలియన్ డాలర్లు. మార్కెట్ విలువ పరంగా మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో, ఆల్ఫాబెట్ నాలుగో స్థానంలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.845 ట్రిలియన్ డాలర్లు కాగా, ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ 1.277 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
టాప్ 100లో ఒక్క అదానీ కంపెనీ కూడా లేదు
ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లో 3 భారతీయ కంపెనీలు ఉన్నాయి. భారతదేశపు అతి పెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి (Mukesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Relinace Industries), 213.60 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో 40వ స్థానంలో ఉంది. మార్కెట్ విలువ పరంగా భారతదేశంలోనే అత్యంత విలువైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచ స్థాయిలోకి వెళ్లే సరికి 40వ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. టాప్ 100 జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 72వ స్థానంలో నిలవగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) 93వ స్థానంలో ఉంది.
భారత్, ఆసియాలో అతి పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు, ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీకి (Gautam Adani) చెందిన ఒక్క కంపెనీ కూడా టాప్ 100లో చోటు దక్కించుకోలేదు.
అమెరికాలో ఉద్యోగుల సగటు వార్షిక జీతం 74,738 డాలర్లు. వారానికి సగటున 1433.33 డాలర్లు అందుకుంటున్నారు. ఆపిల్ ఒక్క సెకనులోనే 1820 డాలర్లు సంపాదిస్తోంది. ఈ లెక్కన... సగటు అమెరికన్ వర్కర్ ఒక వారంలో సంపాదించే దాని కన్నా 387 డాలర్ల ఎక్కువ మొత్తాన్ని ఒక్క సెకనులోనే ఆపిల్ సంపాదిస్తోంది.