Uber Motorhome: ఉబెర్ మోటార్‌హోమ్ వచ్చేసింది - ఇంటి లాంటి సౌకర్యాలతో విలాసవంతమైన రైడ్
Uber Motorhome: ఉబెర్ కొత్త లగ్జరీ మోటార్‌హోమ్ సర్వీస్ ప్రత్యేకంగా ప్రయాణికుల విలాసవంతమైన ప్రయాణ అవసరాల కోసం రూపొందించారు. ఇది నలుగురు నుంచి ఐదుగురికి వసతి కల్పిస్తుంది.

Uber Motorhome Luxury Travel Service India: దిల్లీ-NCRలో మోటార్‌హోమ్ సర్వీస్‌ను ప్రారంభించిన రైడ్-షేరింగ్ కంపెనీ ఉబెర్, ఇప్పుడు ఆ లగ్జరీ సర్వీస్‌ను ముంబై, బెంగళూరు & పుణెకు కూడా విస్తరించింది. ఇది పరిమిత ఎడిషన్ క్యాంపెయిన్. కస్టమర్‌లు నగరం లోపల కాకుండా బయటి ప్రాంతాలకు వెళ్లడం కోసం ఈ మోటార్‌హోమ్‌ను బుక్ చేసుకోవచ్చు. పేరుకు మోటార్‌హోమ్ అయినప్పటికీ, ఇది నడిచే లగ్జరీ హోటల్ లాంటింది.
ఏంటి ఈ మోటార్‌హోమ్ సర్వీస్?
ఉబెర్ ప్రారంభించిన ఈ కొత్త సేవ... కుటుంబం లేదా స్నేహితులతో ప్రయాణించేటప్పుడు ఇంటి లాంటి సౌకర్యాలను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా వచ్చింది. ఈ సర్వీస్‌లో సాధారణ కారు కాకుండా పెద్ద వ్యాన్‌ను ఉబెర్ ఇస్తుంది. ఆ వ్యాన్‌లో సోఫాలు, బాత్రూమ్, మైక్రోవేవ్, మినీ రిఫ్రిజిరేటర్ & ఫోల్డబుల్ బెడ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. అంటే, మీ జర్నీ చాలా లగ్జరీగా సాగుతుంది.
ఉబెర్ మోటార్‌హోమ్‌లో ఇంకా ఏమేం పొందుతారు?
ఉబెర్ కొత్త లగ్జరీ మోటార్‌హోమ్ సర్వీస్‌ను, ప్రత్యేకంగా, ప్రయాణికుల విలాసవంతమైన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ మోటార్‌హోమ్ నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులకు సౌకర్యవంతమైన వసతి కల్పించగలదు. ప్రయాణీకుల సౌకర్యవంతమైన సీటింగ్ అనుభవం కోసం ఈ వాహనంలో మెత్తటి సోఫా & కుర్చీలు అమర్చారు. అలసిపోయినప్పుడు హాయిగా నిద్రపోవడం కోసం మంచం కూడా ఉంటుంది, అవసరం లేనప్పుడు దీనిని మడత పెట్టవచ్చు. జర్నీలో ఆహారం & పానీయాల కోసం మోటార్‌హోమ్‌లోనే ఒక మైక్రోవేవ్ & మినీ రిఫ్రిజిరేటర్ కూడా ఉన్నాయి.
డ్రైవర్ & హెల్పర్
మోటార్‌హోమ్ ప్రయాణాన్ని చాలా విలాసవంతంగా ఉంచేందుకు శిక్షణ పొందిన డ్రైవర్ & ఒక సహాయకుడిని ఈ వ్యాన్‌తో పాటు అందిస్తారు. రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. తాము ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం, ఎంత సేపట్లో గమ్యం చేరతాం వంటి విషయాలను ప్రయాణీకులు ప్రతి క్షణం పర్యవేక్షించవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం 24x7 హెల్ప్‌లైన్ మద్దతు కూడా అందుబాటులో ఉంది. వారాంతపు పర్యటనలు, పిక్నిక్‌లు, పండుగలు, కుటుంబ కార్యక్రమాలు లేదా ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ మోటార్‌హోమ్ సర్వీస్ చాలా అనుకూలంగా ఉంటుంది &ప్రత్యేకమైన అనుభవం అందిస్తుంది.
ఇంటర్‌సిటీ ప్రయాణాలను ఇంకా విస్తరించిన ఉబెర్
మోటార్‌హోమ్ సేవలతో పాటు, ఉబెర్, తన ప్రస్తుత ఇంటర్‌సిటీ సర్వీసులను దేశవ్యాప్తంగా మరింత విస్తరించింది. ఇంటర్‌సిటీ సర్వీస్‌లు ఇప్పుడు 3,000కి పైగా మార్గాల్లో అందుబాటులో ఉంది, దేశంలోని చాలా నగరాల మధ్య ప్రయాణాన్ని సులభంగా మార్చింది. దిల్లీ, ఆగ్రా, లక్నో, కాన్పూర్, అహ్మదాబాద్, వడోదర, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు & మైసూర్ వంటి ప్రధాన నగరాల్లో ఉబెర్ ఇంటర్‌సిటీ సేవకు అత్యధిక డిమాండ్ ఉంది.





















